iDreamPost
android-app
ios-app

దుబ్బాక లో సోదాల కాక‌..!

దుబ్బాక లో సోదాల కాక‌..!

దుబ్బాక ఉప ఎన్నిక గ‌డువు స‌మీపిస్తున్న‌ వేళ‌.. రాజ‌కీయ స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఎత్తులు.. పై ఎత్తుల‌కు తోడు.. త‌నిఖీలు, సోదాల‌తో ఉద్రిక్త‌త‌కు దారి తీస్తోంది. సోమ‌వారం జ‌రిగిన సోదాలతో సిద్దిపేట ర‌ణ‌రంగంగా మారింది. ప్ర‌ధానంగా బీజేపీ అభ్య‌ర్థిని రాజ‌కీయాలు చుట్టు ముడుతున్నాయి. వివాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా మూడోసారి దుబ్బాక బరిలో నిలిచిన ర‌ఘునంద‌న్ రావు మామ ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు వెలుగుచూడ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంట్లో నుంచి ఓ కానిస్టేబుల్ తీసుకొస్తున్న నోట్ల క‌ట్ట‌ల‌ను బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రికి తోచిన‌న్ని వారు లాక్కుపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం… వారిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు పెరిగెత్త‌డం.. సోదాల‌పై బీజేపీ కార్య‌క‌ర్త‌ల నినాదాలు, ధ‌ర్నాల‌తో నియోజ‌క‌వ‌ర్గం హోరెత్తింది. ఎన్నిక‌ల కాక తీవ్ర స్థాయికి చేరింది.

వ‌రుస‌గా సోదాలు..

సిద్ధిపేటలోని బీజేపీ అభ్య‌ర్థి రఘునందన్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇదే టైంలో ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో రఘునందనరావు రాంగోపాలరావు నివాసంలో దాదాపు 18.65 ల‌క్ష‌ల నగదును అధికారులు సీజ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రఘునందనరావు అక్కడకు చేరుకోవడంతో లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో వాద్వివాదానికి దిగారు. ఏ సెక్షన్ ప్రకారం తన ఇంట్లో సోదాలు చేశారో చెప్పాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. రఘునందన్. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనను మాత్రమే టార్గెట్ చేసి సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. రాంగోపాలరావు నివాసం నుంచి ఓ కానిస్టేబుల్ డబ్బుల సంచితో బయటకు రాగా కొందరు బీజేపీ కార్యకర్తలు కానిస్టేబుల్‌ మీదకు వెళ్లి బ్యాగ్‌లోని నగదు అందినంత లాక్కొని పరారు అయ్యారు. అయితే కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు వెనక్కు తీసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్ప‌డింది.

టార్గెట్ చేశారంటూ..

గ‌తంలో కూడా బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద్ అనుచరుల వ‌ద్ద న‌గ‌దు దొరికింది. అలాగే ఆయ‌న‌పై ఓ మ‌హిళ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేస్తూ ఇటీవ‌ల మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు తాజాగా ఆయ‌న మామ ఇంట్లో న‌గ‌దు సీజ్ చేశారు. ఈ నేప‌థ్యంలో దుబ్బాక లో ర‌ఘునంద‌న్ ను టార్గెట్ చేస్తూ రాజీకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ర‌ఘునంద‌న్ మామ ఇంటి ముందు ధ‌ర్నా చేశారు. తన ఇంట్లో వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట‌లో ర‌ఘునంద‌న్ రావు సొమ్మ‌సిల్లి కింద ప‌డిపోయారు. దీంతో కార్య‌క‌ర్త‌లు మ‌రింత ఆగ్ర‌హంతో పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.

దుబ్బాక‌కు కేంద్ర బ‌ల‌గాలు…

దుబ్బాకలో కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. దుబ్బాకలో ఎలాగైన గెలవాలని చూస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంటితో పాటు ఆయన బంధువులు ఇళ్లపై పోలీస్ లు దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తెలుసుకుని టీఆర్ ఎస్ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు డీకే అరుణ. ఇదిలా ఉండ‌గా.. టీఆర్ఎస్ నేత, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. మరోపక్క, బీజేపీ.. దుబ్బాకలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని టీఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగుతోంది. ఎవరు గెలుస్తారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కనీ వినీ ఎరుగని స్థాయిలో దుబ్బాకలో ఆయా పార్టీలు పెద్దయెత్తున డబ్బు వెదజల్లుతుండడంతో ప్రజాస్వామ్యమే ఓడిపోతోందని ప్ర‌జాస్వామ్య‌వాదులు వాపోతున్నారు.