iDreamPost
android-app
ios-app

ఒక్క విద్యార్థి కోసం ఏకంగా బస్‌టైమింగ్స్‌నే మార్చారు..

ఒక్క విద్యార్థి కోసం ఏకంగా బస్‌టైమింగ్స్‌నే మార్చారు..

ఒడిషాకి చెందిన ఒక విద్యార్థి పాఠశాలకు రోజూ ఆలస్యంగా వెళ్తున్నాడు. కారణం బస్సు ఆలస్యంగా రావడమే. ఆ బస్సు కాస్త ముందుగా వస్తే ఆ విద్యార్థి సరైన సమయానికి పాఠశాలకు చేరుకుంటాడు. కానీ ఒక్క విద్యార్థి కోసం బస్సు టైమింగ్స్ మార్చరు కదా.. కొందరు విద్యార్థులైతే హమ్మయ్య క్లాసులు ఎగ్గొట్టడానికి మంచి కారణం దొరికిందని ఆనందపడతారు. కానీ ఆ విద్యార్థి అలా అనుకోలేదు. దాంతో ఫలితం దక్కింది. బస్సు సరైన సమయానికి రావడం వల్ల ఇప్పుడు ముందుగా పాఠశాలకు చేరుకుని అన్ని క్లాసులు వినగలుగుతున్నాడు.

ఆ విద్యార్థి ఏం చేసాడంటే?

ఒడిశాలోని భువనేశ్వర్‌ నగరంలో ఎంబీఎస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సాయి అన్వేష్‌ అమృతం ప్రధాన్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. అతను రోజు బస్సు ఎక్కి పాఠశాలకు వెళ్ళేవాడు. అతని స్కూల్ ఉదయం 7.30 కి ప్రారంభం అవుతుంది కానీ బస్సు మాత్రం 7.40 కి వస్తుంది. దీంతో అతను రోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడం వల్ల టీచర్స్ చెప్పే క్లాసులు మిస్ అయ్యేవాడు. డైలీ ఆలస్యంగా రావడం వల్ల ఒక్కోసారి టీచర్ల చీవాట్లు కూడా తప్పేవి కావు.

దీంతో సాయి అన్వేష్‌ ట్విట్టర్ ద్వారా క్యాపిటల్‌ రీజియన్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌(సీఆర్‌యూటీ) సంస్థ ఎండీ, ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ బొత్రాను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు. అందులో బస్సు ఆలస్యంగా రావడం వల్ల పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుందని దయచేసి నేను స్కూలుకు సరైన సమయానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా అభ్యర్దించడంతో స్పందించిన అరుణ్ బోత్రా మరియు సీఆర్‌యూటీ త్వరలోనే బస్సు టైమింగ్స్ మారుస్తాని హామీ ఇచ్చారు. అంతేకాకుండా బస్సు టైమింగ్ ని కూడా మార్చారు. దీంతో సాయి అన్వేష్ పాఠశాలకు సరైన సమయానికి చేరుకోగలుగుతున్నాడు. తన ట్వీట్ కి స్పందించి బస్ టైమింగ్స్ ని మార్చిన అధికారులకు సాయి అన్వేష్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

కాగా విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో గుర్తించి ఒక్క విద్యార్థి కోసం బస్సు టైమింగ్స్ మార్చిన అధికారుల నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జపాన్ ప్రభుత్వం కేవలం ఒక్క విద్యార్థి కోసం ఏకంగా స్పెషల్ ట్రైన్ నడిపిన సంగతి తెలిసిందే. అక్కడ స్పెషల్ ట్రైన్ నడిపితే ఇక్కడ ఒడిశా రాష్ట్రంలో బస్సు టైమింగ్స్ మార్చడం గమనార్హం.