iDreamPost
android-app
ios-app

అక్టోబర్ 2 – పెద్ద యుద్ధమే ఉంది

  • Published Sep 19, 2020 | 11:52 AM Updated Updated Sep 19, 2020 | 11:52 AM
అక్టోబర్ 2 – పెద్ద యుద్ధమే ఉంది

మాములుగా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేరోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం చాలాసార్లు చూసాం. సంక్రాంతి లాంటి సీజన్లలో ఓకే కానీ మిగిలిన టైంలో వస్తే మాత్రం పరస్పరం ప్రభావం చెంది కలెక్షన్లు తగ్గిన సందర్భాలు కోకొల్లలు. అది థియేటర్లు నడిచినప్పటి పరిస్థితి. ఇప్పుడంతా ఓటిటి మయం. ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్లే అవసరం లేకుండా కుటుంబసభ్యులతో కలిసి కూర్చుకుని నేరుగా డైరెక్ట్ రిలీజులను ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా క్లాష్ ఉంటే అప్పుడెలా. ఇప్పుడదే జరగబోతోంది. అక్టోబర్ 2న సౌత్ లో ఏకంగా మూడు క్రేజీ మూవీస్ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధం కావడం మూవీ లవర్స్ ని తెగ ఊరిస్తోంది.

ముందుగా కర్చీఫ్ వేసుకుంది రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా. ఆహా యాప్ ద్వారా అర్ధరాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఇది ఫిక్సయిన కొద్దిరోజులకె అనుష్క నిశ్శబ్దం కూడా అదే డేట్ ని లాక్ చేసుకుని నిన్నటి కూడా ప్రకటనలు కూడా ఇచ్చేశారు. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ముందు రోజు రాత్రే అంటే అక్టోబర్ 1 రాత్రి 10 గంటలకే స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాని వికి కూడా ఇలాగే చేశారు.

ఇవి కాకుండా జీ 5/ జీ ఫ్లెక్స్ లో విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన కెపే రణసింగం కూడా రాబోతోంది. వీళ్ళు మన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే కాబట్టి చూసే ఆడియన్స్ ఉంటారు. తెలుగు వెర్షన్ కూడా డబ్ చేసి పెడతారని టాక్. ఇలా మొత్తం మూడు సినిమాలు నువ్వా నేనా అనేలా తలపడబోతున్నాయి. అయితే ఫ్రీనే కదా ప్రేక్షకులు మూడు సినిమాలు చూస్తారు అలాంటప్పుడు పోటీ ఏముంది అనే అనుమానం రావొచ్చు. కానీ ఒక సినిమా పూర్తయ్యే లోపు మిగిలిన రెండు మూడు సినిమాలకు సంబంధించిన టాకులు, రివ్యూలు బయటికి వచ్చేస్తాయి. యావరేజ్ గా ఉన్నా లుక్ వేస్తారు కానీ నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే రెండు గంటల టైం వేస్ట్ చేయడం ఎందుకని అనుకునేవాళ్లు కూడా ఉంటారు. ఓటిటిలో కూడా ఇప్పుడు ఇలాంటి రిస్క్ ఉంది. అందులోనూ మూడు వేర్వేరు ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్నాయి కాబట్టి ఈ రిపోర్ట్స్ కీలకంగా మారతాయి. సో పోరైతే రసవత్తరంగా ఉండటం ఖాయం