సోషల్ మీడియాలో కొందరు రాత్రికిరాత్రే సెలెబ్రెటీ అవుతారు. మరికొందరు రోడ్డున పడతారనే దానికి ఇటీవల మీడియాలో హల్చల్ చేస్తున్న బుల్లెట్ బండి బండి సాంగ్ ఓ ఉదాహరణ. ఈ పాటకు డాన్సు చేసినా ఒక కొత్త జంట సోషల్ మీడియాలో సెలెబ్రెటీ అయితే ఒక వైద్య ఉద్యోగి కొంప ముంచింది.చివరికి జాబ్ పోయే పరిస్థితి వచ్చింది. సింగర్ మోహన భోగరాజు పాడి ఆడిన “బుల్లెట్ బండి” ఒరిజినల్ వెర్షన్ కన్నా మొన్న మంచిర్యాల కొత్తజంట సాయిశ్రీయ, అశోక్ ల బారాత్ సందర్భంగా పెళ్లి కూతురు సాయి శ్రీయ చేసిన డాన్స్ వైరల్ అయింది.దీంతో ఈ జంట కూడా ఇప్పుడు ఫేమస్ అయ్యారు. వరుసగా మీడియాలో ఎక్కడ చూసిన ఈ జంటనే..
అయితే ఇప్పుడు ఈ బుల్లెట్ బండి పాట ఓ నర్సు ఉద్యోగం పోయేలా చేసింది.
రాజన్న సిరిసిల్ల తంగళపల్లి PHC లో స్వాతంత్య్ర దినోత్సవం రోజు కాంట్రాక్ట్ ఉద్యోగి నర్సు జ్యోతి సరదాగా బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసింది. ఆ సమయంలో మిగితా ఉద్యోగులు కూడా అక్కడే ఉండి ఆమెను ఎంకరేజ్ చేశారు.ఈ వీడియో లేటుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఈ వీడియోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు నర్సు డాన్స్ కు ఫిదా అయ్యి అభినందనలు తెలుపుతూ వీడియో షేర్ చేస్తున్నారు. కానీ మరోవైపు డ్యూటీ సమయంలో బాధ్యతను మరచి డాన్సులు ఏమిటని ప్రశ్నించారు. ఇలా డ్యూటీ సమయంలో నర్స్ డాన్స్ పై విమర్శలు రావడంతో ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ గా స్పందించారు. విచారణకు ఆదేశించారు.కలెక్టర్ ఆదేశాలతో డ్యాన్సు చేసిన నర్సుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేశారు.
జ్యోతికి మెమో జారిచేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విధులు వదిలిపెట్టి డాన్స్ చేస్తే తప్పు కాని స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా డాన్స్ చేయడం పెద్ద తప్పుగా భావించాల్సిన అవసరం లేదని పలువురు నెటిజన్లు అంటున్నారు..అలా అయితే కోవిడ్ ఆసుపత్రుల్లో వారి రోగుల మనోధైర్యం కోసం అనేక చోట్ల నర్సులు పాటలు, డాన్సులు చేసిన వీడియోలు కూడా అప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకున్నప్పుడు ఇప్పుడు ఎలా తప్పు అవుతుందని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఒక్క పాటతో ఒక జంటని రాత్రికి రాత్రే ఆకాశానికి ఎత్తిన సోషల్ మీడియానే ఇప్పుడు ఓ ఉద్యోగిని రోడ్డున పడేసింది. సహోద్యోగులతో ఆనందంగా నర్సు చేసిన డాన్సుకు అధికారులు చర్యలు తీసుకోవడం బాధాకరం. మానవతా దృక్పథంతో నర్సు అంశాన్ని చూడాలని నెటిజన్లు కోరుతున్నారు.
Also Read : ఈ ‘బుల్లెట్టు బండి…’ పాట ఎందుకింత సంచలనం అయింది?