iDreamPost
android-app
ios-app

సక్రమంగా స్పందిస్తే చంద్రబాబు ఎందుకవుతారు?

  • Published Jan 27, 2022 | 3:19 PM Updated Updated Mar 11, 2022 | 10:21 PM
సక్రమంగా స్పందిస్తే చంద్రబాబు ఎందుకవుతారు?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ పేరున జిల్లా ప్రకటించినా ప్రశంసించకపోగా చిత్రంగా స్పందించారు. దీనిపై సక్రమంగా స్పందిస్తే చంద్రబాబు ఎందుకవుతారు అంటూ వైఎస్సార్‌ సీపీ నేతలు బాబు స్పందించిన తీరును ఎండగడుతున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై గురువారం చంద్రబాబు స్పందిస్తూ ఎన్టీఆర్‌ను ఎవ‌రు గౌర‌వించినా తాము స్వాగ‌తిస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.

కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు భారత రత్న గుర్తుకు రాలేదా?

తాను కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు రాష్ట్రపతులను, ప్రధానులను ఎంపిక చేశానని చెప్పుకోవడమే గాని చంద్రబాబు అప్పుడు ఎందుకు ఎన్టీఆర్‌కు భారత రత్న ప్రకటింపజేయలేదు అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ప్రకటిస్తే ఆమె సతీమణి లక్ష్మీపార్వతికి అందజేస్తారని, అది ఇష్టంలేని కారణంగానే చంద్రబాబు అడ్డుపడ్డారని విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహాల ధ్వంసం, స్మృతివనం ప్రాజెక్టు, అన్నా క్యాంటీన్‌ల నిలిపివేత అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు.. వెన్నుపోటు ద్వారా అసలు ఎన్టీఆర్‌నే లేకుండా చేశారని గుర్తు చేస్తున్నారు.

27 ఏళ్ల క్రితం ఆయనను అత్యంత అమానవీయంగా పదవీచ్యుతుణ్ణి చేసి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఏటా ఎన్టీఆర్‌ జయంతి, వర్థంతి నిర్వహిస్తూ అటు కుటుంబ సభ్యులను, ఇటురాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. అసలు ఆయన పేరును ఉచ్చరించే అర్హత కూడా బాబుకు లేదు. మూడు రాజ‌ధానుల ప్రకటన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయాలు జనం అభీష్టం మేరకు తీసుకొన్నవే తప్ప సీఎం జగన్‌కు వేరే రాజకీయ ప్రయోజనాలు లేవని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. ఏ విషయంలోనైనా రాజకీయ కోణం చూడడం, వాస్తవాలను వక్రీకరించి తనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు నైజమని చెబుతున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీతో నిత్యం పోరాడుతున్నప్పటికీ ఆయన పేరుతో జిల్లా ప్రకటించి జగన్ రాజకీయాలకు అతీతంగా వ్యహరించారని అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని, చంద్రబాబు సన్నాయి నొక్కులను జనం గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.

ఎన్టీఆర్‌ పేరిట జిల్లా ప్రకటిస్తానని జగన్‌మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేశారని చెబుతున్నారు. తమ నేత ఇచ్చిన మాట నిలబెట్టుకోగా 
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు ఆ పని చేయలేకపోయారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.