Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నిన్నమొన్నటి వరకూ వైసీపీ రూపంలో ఒక ప్రత్యర్థి మాత్రమే ఉండగా.. ఇప్పుడు బీజేపీ రూపంలో రెండో ప్రత్యర్థి ఎదరునిలబడింది. నిలబడడమే కాదు టీడీపీపై దూకుడుగా వెళుతోందని ఆ పార్టీ నేతల వ్యవహారశైలిని చూసే అర్థం అవుతోంది.
తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ సహ ఇంఛార్జి సునిల్ దియోధర్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్టీఆర్‌ను పార్టీ, ముఖ్యమంత్రి స్థానం నుంచి దించి చంద్రబాబు సీఎం పీఠం ఎక్కి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా సునిల్ చంద్రబాబుకు ఆ విషయం గుర్తు చేస్తూ ట్విట్ చేశారు. అంతేకాకుండా త్వరలో చంద్రబాబు రాజకీయాల నుంచి కూడా పూర్తిగా నిష్క్రమించబోతున్నారంటూ బాంబు పేల్చారు. అదే సమయంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర విభాగం ఈ సందర్భంగా బాబుపై సెటైర్ వేసింది. చంద్రబాబుకు వెన్నుపోటు దినం శుభాకాంక్షలంటూ చురక అంటించింది.
ఓ వైపు వైసీపీ దూకుడును తట్టుకోలేక సతమతమవుతున్న చంద్రబాబుకు.. బీజేపీ రాజకీయం గోరు చుట్టుమీద రోకలిపోటు మాదిరిగా మారింది. వైసీపీని ఎలా ఎదుర్కొవాలో తెలియక టీడీపీ నానా తంటాలు పడుతుంటే ఆ స్థానంలోకి ఎప్పడెప్పుడు వద్దామనా అన్నట్లుగా బీజేపీ కాచుకుని కూర్చుంది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై మునుపెన్నడూలేని విధంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యం అని ప్రకటించిన బీజేపీ నేతలు ఆ దిశగా పయనిస్తున్నట్లు వారు చేస్తున్న రాజకీయం ద్వారా అర్థం అవుతోంది.
బహుసా చంద్రబాబు తాజాగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఊహించి ఉండబోరు. ఎందుకంటే టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చినప్పటి నుంచి ఆయన టీడీపీనే కాక బీజేపీ రాజకీయాన్ని రాష్ట్రంలో నడిపిస్తున్నారు. వెంకయ్య నాయుడు నుంచి నిన్నమొన్నటి వరకూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ వరకూ బీజేపీలో బాబు చెప్పిందే నడిచింది. దీంతో కొన్ని విషయాల్లో ఆయన పని సులువైంది. ఎన్నికల్లోనూ బీజేపీని తన అధికారం కోసం ఉపయోగించుకున్నారు.
అయితే కాలం మారింది. తనకు ఊతంగా ఉన్న కర్రే తిరిగి తనను కొట్టేందుకు సిద్ధమైనట్లుగా చంద్రబాబుకు బీజేపీ నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. వెంకయ్యనాయుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం అవడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం తర్వాత బాబు పార్టీ ఇద్దరు ప్రత్యర్థులతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. బీజేపీ నేతలు ప్రారంభంలోనే చంద్రబాబుపై ఈ స్థాయిలో దూకుడుగా వెళుతుంటే.. భవిష్యత్‌లో మరెంత దూకుడుగా వెళతారో వేచి చూడాలి.