iDreamPost
iDreamPost
‘‘రేయ్ కొంచెం ఎక్కువైందిరోయ్..’ అంటే నీకెంత కావాలో అంతే తీసుకోరా.. అంటూ ఇద్దరి స్నేహితుల మధ్య వచ్చే సినిమా డైలాగ్ కొంచెం పాపులరే. సినిమా కాబట్టి ఎవరికి ఎంత కావాలో అంతే తీసుకుంటారు. నో ప్రాబ్లెమ్. కానీ రాజకీయాల్లో కొచ్చేసరికి నాయకులకు ఎంత కావాలో అంత జనం తీసుకోరు. వాళ్ళకెంత కావాలంటే అంత తీసుకుంటారు. ఆయా పార్టీల నాయకుల వ్యవహారశైలి మీద ప్రజలు తీసుకునే ‘పరిమాణం’ ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు ఏపీలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే తరహా అంతర్మధనం జరుగుతున్నట్లుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రథం దగ్ధం అయిన వెంటనే ప్రభుత్వం చేపడుతున్న చర్యలను గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఉద్యమ కార్యాచరణకు పరాక్రమించేసారు. అధికార వైఎస్సార్‌సీపీని ఇరుకున పెట్టడం, నేరుగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం అన్న లక్ష్యంతో సాగిన ఈ పరాక్రమణ క్రమంలో అనేక పేర్లు, రకరకాల కార్యక్రమాలతో ఉద్యమ కేలెండర్ కూడా రిలీజైపోయింది.
అంతేగానీ సదరు ఉద్యమ ఫలితం ఎంత? తద్వారా ప్రజల్లో తమై ఏర్పడే అభిప్రాయమేంటి? తామాశిస్తున్న ప్రయోజనం చేకూరుతుందా? లేదా? తదితర విషయాలపై అంచనాలేసుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న వారే జడ్జిమెంట్ చెప్పాల్సిన పరిస్థితులు సంభవించేసాయి.
అనేక డక్కామొక్కీలు తిని సీయం పీఠమెక్కిన వైఎస్ జగన్ ఇక్కడే తన రాజకీయ చతురతను చాటారు. రథం దగ్ధం విషయంలో ప్రభుత్వాధినేతగా తాను చేయాల్సిన పనులను చిత్తశుద్ధితో చేపట్టారు. అయినప్పటికీ ప్రతిపక్షాల రాద్ధాంతం ఆగే సూచనలు కన్పించడం లేదు. పైగా మరింత ఉద్దేశ్యపూర్వక ఉద్యమం కొనసాగించే క్రమంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసును అప్పగించేసారు. తద్వారా నిజానిజాలు వెలికి రావాలన్నదే తన లక్ష్యమని చాటుకోవడంతో పాటు, ప్రతిపక్షాలు చేస్తున్న ‘మతం’ ఆరోపణల్లో పస లేదన్న సంకేతాలనిచ్చారు.
ప్రతిపక్ష పార్టీల తీరుతో వేడెక్కిపోతున్న రాష్ట్ర రాజకీయ వాతావరణంపై చటుక్కున నీళ్ళు చల్లేసారు. దీంతో ఇప్పుడు బాల్ కేంద్రం కోర్టులోకి చేరినట్లయింది. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి అసలు నిజాలను బైటపెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. అంటే రాష్ట్రంలో బీజేపీ–జనసేన, టీడీపీలపై కూడా ఉందన్నమాటే. మొదటి రెండు పార్టీలు ఉమ్మడిగానే పయనిస్తుండగా, మూడో పార్టీ కొత్తగా బీజేపీతో వన్‌సైడ్ లవ్‌లో మునిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీయం వైఎస్ జగన్ పక్కా క్లారిటీగానే ఉన్నారు. తేల్చుకోవాల్సింది ఇక ఆ మూడు పార్టీలేనన్నది పలువురు అధికార పార్టీ నేతలంటున్న మాట.