Idream media
Idream media
రైతులకు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచిత విద్యుత్ అందించే విషయంలో పారదర్శక విధానాలు అవలంబిస్తోంది ఆంధ్రప్రదేశ్. అలాగే ఇటీవల తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో ప్రమాదాల నివారణే లక్ష్యంగా విద్యుత్ శాఖ ముందుకు వెళ్తోంది. ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను, ఆయా కంపెనీల్లో విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో విద్యుత్ సిబ్బంది రైతులకు, ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ప్రజలు, వినియోగదారులు విద్యుత్ ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యుత్ చౌర్యం చౌర్యానికి పాల్పడవద్దని, బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆ శాఖ అధికారులు కోరుతున్నారు.
నిరంతర సూచనలు, అవగాహన కార్యక్రమాలు
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఆ శాఖ అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏయే చర్యలు ద్వారా సురక్షిత విద్యుత్ పొందొచ్చో ప్రజలకు చెబుతున్నారు. అవేమిటంటే.. విద్యుత్ ప్రవాహకాలైన ఇనుము, సిల్వర్ నిచ్చెనలు వాడేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యుత్ తీగలను గమనించి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటూ పనులు చేసుకోవాలి. నాణ్యమైన, ప్రమాణాలతో కూడిన విద్యుత్ పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. పాడైపోయిన స్విచ్‌లు, విద్యుత్ పరికరాలు, వైర్లను వెంటనే మార్చుకోవాలి. ముఖ్యంగా అతుకులు వేసిన విద్యుత్ వైర్లను వాడకూడదు. తడి దుస్తులను, ఇనుప కడ్డీలపై, విద్యుత్ వైర్లకు సమీపంలో ఆరబెట్టకూడదు. ఇనుము, విద్యుత్ ప్రవాహక వస్తువులను డాబా పైకి తీసుకెళ్లేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యుత్ తీగలను గమనించాలి.
రైతులు పొలాల్లో విద్యుత్ తీగలను అతి తక్కువ ఎత్తులో కొక్కేలను అమర్చుకుని మోటార్లు ఆడిస్తున్నారు. దీని వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విద్యుత్ ప్రమాణాలతో కూడిన స్విచ్‌లు, ఫ్యూజ్ క్యారియర్లు ఏర్పాటు చేసుకుని వాడుకుంటే ప్రమాదాలు నివారించవచ్చు. పంట పొలాలకు ఏర్పాటు కేసిన కంచెకు విద్యుత్‌ను వాడకూడదు. విద్యుత్ పరికరాలపై పనిచేసుకునేటప్పుడు దాని విద్యుత్ ప్రవాహం నుంచి భూమికి మధ్య 8 అడుగుల క్లియరెన్స్ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. తడి చేతులతో విద్యుత్ స్విచ్ మరియు పరికరాలను తాకకూడదు.
అప్రమత్తంగా ఉండాలి..
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చు. కొంతమంది తెలియక నిర్లక్ష్యంగా ఉంటే మరికొందరు తెలిసి కూడా అంతే నిర్లక్ష్యంగా ఉంటారు. వినియోగదారులకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నం.1912కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చునని అధికారులు ఆయా నెంబర్ ను కూడా ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు.