iDreamPost
android-app
ios-app

నూతన సంవత్సరంలో ఏపీలో పదవుల పండగ

నూతన సంవత్సరంలో ఏపీలో పదవుల పండగ

ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరం, సంకాంత్రి పడుగలతోపాటు రాజకీయ నేతలకు పదవుల పండగ కూడా రానుంది. వైఎస్సార్‌సీపీ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటి సారిగా భారీ ఎత్తున నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక మండళ్లను నూతన సంవత్సరంలో ఏర్పాటు చేస్తామని ఏపీ మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపీదేవి వెంకటరమణ ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ ద్వితియ శ్రేణి నేతల్లో కోళాహలం మొదలైంది.

216 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు…

రాష్ట్రంలో గత ప్రభుత్వ హాయం వరకు 191 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో రెండు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా లేదు. వ్యవసాయం, రైతు పంట విక్రయం, గిట్టుబాటు ధరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మార్కెట్‌ కమిటీలు లేని నియోజకవర్గాల్లో నూతనంగా మరో 25 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సంఖ్య 216కు చేరింది.

వైఎస్సార్‌సీపీ నేతలకు 3456 పదవులు…

216 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ఇకపై స్థానిక ఎమ్మెల్యే గౌరవ చైర్మన్‌గా ఉండనున్నారు. చైర్మన్‌తోపాటు మొత్తం 20 మంది డైరెక్టర్లు పాలక మండలిలో నియమించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 12 మంది రైతులు (వ్యవసాయం, పాడి రైతులు), ముగ్గురు వ్యాపారులు, నలుగురు అధికారులను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఫలితంగా చైర్మన్‌తోపాటు మొత్తం 4320 పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో డైరెక్టర్లుగా నియమించాల్సిన అధికారులు 864 మందిని మినహాయించగా 3456 పదవులు రాజకీయ నేపథ్యం ఉన్న వారితో భర్తీకానున్నాయి.

అన్ని కులాలకు ప్రాధాన్యం..

నామినేటెడ్‌ పదవుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చట్టం చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ఆయా సామాజిక వర్గాలకు పదవులు రిజర్వ్‌ కానున్నాయి. మొత్తం 216 మార్కెట్‌ కమిటీల్లో ఎస్టీలకు 6 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 25 శాతం, మైనారిటీలకు 4 శాతం పదవులు దక్కనున్నాయి. మిగిలిన 50 శాతం (108) జనరల్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. మొత్తం పదవుల్లో 50 శాతం మహిళలను నియమించాలి.

నేతలు, కార్యకర్తల్లో కోళాహలం..

216 మార్కెట్‌ కమిటీ పాలక మండళ్లలో మైనారిటీలకు 9 చైర్మన్‌ పదవులు, 138 డైరెక్టర్, ఎస్టీలకు 13 చైర్మన్, 207 డైరెక్టర్‌ , ఎస్సీలకు 32 చైర్మన్, 518 డైరెక్టర్‌ , బీసీలకు 54 చైర్మన్, 864డైరెక్టర్‌ పోస్టులు లభించనున్నాయి. ఈ మొత్తం పదవుల్లో ఆయా సామాజిక వర్గాల మహిళలను సగం పోస్టుల్లో నియమించాలి. ఇక మిగిలిన 108 చైర్మన్, 1728 డైరెక్టర్‌ పదవులు జనరల్‌ కోటాలో భర్తీ చేయనుండడంతో అధికార పార్టీ నియోజకవర్గ స్థాయి నేతల్లో కోళాహలం మొదలైంది.

మార్కెట్‌ కమిటీలదే కీలక పాత్ర..

రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలదే కీలక పాత్ర కాబోతోంది. జగన్‌ ప్రభుత్వం ప్రతి ఏడాది పంటలకు ముందుగానే మద్దతు ప్రకటించనుంది. ఆయా పంటలకు సరైన మద్ధతు ధర మార్కెట్‌లో లభించని పక్షంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో విక్రయించుకోవచ్చు. అందు కోసం 216 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మారుస్తూ ఇటీవల జరిగిన మంత్రివర్గంలో తీర్మానించారు. ఈ నేపధ్యంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు అధిక ప్రాధాన్యం దక్కనుంది.