iDreamPost
iDreamPost
వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన ప్రాంతం రాయలసీమ. అందులో సొంత జిల్లా కడపతో పాటుగా అనంతపురం, చిత్తూరు జిల్లాల నేతలు కూడా అన్ని సందర్భాల్లోనూ జగన్ వెంట ఉన్నారు. ఆయనకు తోడుగా సాగారు. టీడీపీ హయంలో క్షేత్రస్థాయిలో ఆటంకాలు వచ్చినా ఓర్పుతో అధిగమించారు. అధినేత ఆదేశాలను పాటిస్తూ పార్టీని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం జగన్ కి పెట్టని కోటగా ఆయా జిల్లాలను మార్చేశారు. ప్రతిపక్షానికి పట్టు లేకుండా చేసేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ విదేయతతో వ్యవహరించిన వారందరినీ జగన్ గుర్తించారు. తగిన రీతిలో వారికి పదవులు కట్టబెట్టారు. భవిష్యత్తు పార్టీ అవసరాలను గమనంలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారు. సామాజిక వైరుధ్యం పాటిస్తూ అందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.
అందులో భాగంగా రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవుల్లో చిత్తూరు జిల్లాకు 5, అనంతపురం జిల్లాకు 5, కడప జిల్లాకు 8 చొప్పున కేటాయించారు. అనంతపురం జిల్లాలో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించిన బీసీ బలిజ సామాజికవర్గానికి చెందిన బుక్కపట్నం నవీన్ నిచ్ఛల్ ని ఏపీ అగ్రోస్ చైర్మన్ గా నియమించారు. మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన మెట్టు గోవిందరెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టి అనుభవానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పటికే అనంతపురం మునిసిపల్ కార్పోరేషన్ మైనార్టీలకు కట్టబెట్టగా తాజాగా మళ్లీ మైనార్టీ నేత నిసార్ మహ్మద్ భార్య నదీమ్ అహ్మద్ కి ఉర్దూ అకాడమీ చైర్ పర్సన్ హోదా కేటాయించారు. మాదిగ సామాజికవర్గం నుంచిఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న చములూరి రాజగోపాల్ రావు భార్య హరిత కి నాటక అకాడమి లో పదవి కేటాయించారు. పెన్నా ఓబులేషు భార్య మాల్యవంతం మంజులకి ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ హోదా దక్కింది.
Also Read : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి.. యువత లో జోష్..
చిత్తూరు జిల్లా నుంచి కూడా ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ షఫీ ఉల్లా భార్య షమీమ్ అస్లాంకి దక్కింది. షఫీ చాలాకాలంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా మైనార్టీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత. మెట్టపల్లి చిన్నప్పరెడ్డిని ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ హోదాలో నియమించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డిని నియమించారు. శ్రీశైలం ఎమ్మెల్యే కూడా శిల్పా చక్రపాణిరెడ్డినే కావడం విశేషం. మైనార్టీ ఆస్తుల పరరిక్షణలో కీలకమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఖాధర్ బాషా నియమితులయ్యారు. దాసరి సామాజికవర్గీయుడు కొండవీటి నాగభూషణానికి జానపదాలు, నైపుణ్య సంస్థ చైర్మన్ పదవి దక్కింది. ఆయన కూడా చాలాకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నందుకు గానూ గుర్తింపు దక్కింది.
కడప జిల్లాలో ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ను కరిముళ్ల షేక్ హసీన్ దక్కించుకున్నారు. ఇది ప్రాధాన్యత కలిగిన కార్పోరేషన్లలో ఒకటి. ఆప్కాబ్ చైర్మన్ పదవిని సీనియర్ నేత ఎంవీ రమణారెడ్డి కోడలు మల్లెల ఝాన్సీరెడ్డికి కేటాయించారు. సహకార బ్యాంకుల విషయంలో ఇది కీలక పదవి. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా జిల్లాకే చెందిన ఏ మల్లిఖార్జున్ రెడ్డిని నియమించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు పులి సునీల్ కుమార్ కి దక్కింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ని కోడూరు అజయ్ రెడ్డి కి దక్కింది. ఏపీ స్టేట్ హజ్ కమిటీకి బద్వేల్ షేక్ గౌస్ లజామ్ ని నియమించారు. ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా కార్పోరేషన్ కి వెమపలాకు రామాంజనేయ యాదవ్ భార్య లీలావతిని చైర్మన్ గా ఎంపిక చేశారు.
మొత్తంగా రాయలసీమలోని ఈ మూడు జిల్లాలకు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత దక్కడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక జిల్లా స్థాయి డీసీసీబీ, డీసీఎంఎస్ , గ్రంథాయల సంస్త చైర్మన్ల విషయంలోనూ పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యతనిచ్చారు.
Also Read : నామినేటెడ్ పోస్టులోనూ జగన్ పంథా మారలేదు.. అదే పద్ధతి అవలంభించారు.