iDreamPost
iDreamPost
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదవుల పంపకాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో 135 కార్పొరేషన్లు, సంస్థలకు అధ్యక్షులను నియమించింది. శనివారం ఈ జాబితాను మంత్రులు, వైఎస్సార్సీపీ నాయకులు విడుదల చేశారు. అన్ని కులాలు, వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన నియామకాల్లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు మొత్తం 24 పదవులు లభించాయి. వీటిలో 10 రాష్ట్రస్థాయి పదవులు కాగా..మిగిలిన 14 జిల్లాస్థాయికి చెందినవి. జిల్లాలవారీగా చూస్తే విశాఖ నుంచి పదిమందికి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి చెరో ఏడుగురికి పదవులు లభించాయి. విశాఖ జిల్లాలో ఓసీలకు 5, బీసీలకు 4, ఎస్సీ ఒకరికి అవకాశం కల్పించారు. ఆ పదిమందిలో ఐదుగురు మహిళలే కావడం విశేషం.
విజయనగరం జిల్లాలో ఓసీలకు 2, బీసీలకు 4, ఎస్సీకి ఒక పదవి దక్కాయి. ఈ జిల్లాలో నలుగురు మహిళలు అవకాశం పొందారు. శ్రీకాకుళం జిల్లాలో ఓసీ, ఎస్సీలకు చెందిన ఒక్కొక్కరు, బీసీలు ఐదుగురు పదవులు పొందగా.. మొత్తం మీద నలుగురు మహిళలు పదవులు పొందారు. ఉత్తరాంధ్ర మొత్తం మీద 24 పదవుల్లో 13 మహిళలకే ఇచ్చారు. ఓసీ 8, బీసీ 13, ఎస్సీలకు 3 పదవులు లభించాయి.
Also Read : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి.. యువత లో జోష్..
విశాఖలో..
-విశాఖ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్(గవర-బీసీ) రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు.
-విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి (ఓసీ-క్షత్రియ) నెడ్ క్యాప్ చైర్మన్ అయ్యారు.
-సీతంశెట్టి సుధాకర్ (ఓసీ-బ్రాహ్మణ) రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడు అయ్యారు.
-వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన బొల్లవరపు జాన్ వెస్లీ (ఎస్సీ-మాల) రాష్ట్ర క్రిస్టియన్(మైనారిటీ) ఆర్థిక సంస్థ చైర్మన్ గా నియామకం పొందారు.
-మాజీ ఎమ్మెల్యే చొక్కాకుల వెంకట్రావు సతీమణి చొక్కాకుల లక్ష్మి (బీసీ-కొప్పుల వెలమ) పెట్రో కెమికల్ అండ్ పెట్రో ఇన్వెస్ట్మెంట్ విశాఖ కారిడార్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
-భీమిలి మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు, విశాఖ తూర్పు వైఎస్సార్సీపీ ఇంఛార్జి అక్కరమాని నిర్మల (బీసీ -యాదవ) ప్రతిష్టాత్మక వీఎంఆర్డీఏ అధ్యక్షురాలయ్యారు.
-వైఎస్సార్సీపీ నాయకుడు, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వర రావు (ఓసీ-కమ్మ)ను గ్రేటర్ విశాఖ స్మార్టుసిటీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.
-వైఎస్సార్సీపీ మహిళా నేత, పార్టీ యువజన విభాగం నాయకుడు కొండా రాజీవ్ సోదరి కొండా రమాదేవి(ఓసీ-కాపు) జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలిగా నియమించారు.
– గాజువాక మాజీ కౌన్సిలరు పల్లా చినతల్లి (బీసీ-యాదవ)ని జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ అధ్యక్షురాలిగా నియమించారు.
-నర్సీపట్నం మాజీ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ నేత చింతకాయల సన్యాసిపాత్రుడి సతీమణి చింతకాయల అనిత (ఓసీ-క్షత్రియ) జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలయ్యారు.
Also Read : నమ్ముకున్న వారికి న్యాయం ….. నామినేటెడ్ పదవులతో గోదావరి జిల్లాల నాయకుల్లో ఆనందం
విజయనగరం జిల్లాలో..
-వైఎస్సార్సీపీ నేత కాయల వెంకటరెడ్డి (ఓసీ-రెడ్డి)ని ఏపీ మారిటైం బోర్డ్ చైర్మన్గా నియమించారు.
-విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత జమ్మన ప్రసన్నకుమార్(ఎస్సీ) ఏపీ టిడ్కొ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
-నెల్లిమర్ల మాజీ జెడ్పీటీసీ గదల బంగారమ్మ (బీసీ-తూర్పు కాపు) ఏపీఎస్సార్టీసీ ప్రాంతీయ మండలి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
-సాలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకురాలు రెడ్డి పద్మావతి (బీసీ-వెలమ)ని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలిగా నియమించారు.
-బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన ఇంటి పార్వతి(ఓసీ-తెలగా)ని బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ(బుడా) చైర్మన్ గా నియమించారు.
-విజయనగరం నియోజకవర్గానికి చెందిన అవనాపు భావన(బీసీ-నాగవంశం) ను జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ చైర్ పర్సన్ చేశారు.
-గజపతినగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత నెక్కల నాయుడుబాబుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పదవి ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో..
-నరసన్నపేట నియోజకవర్గ మహిళా నాయకురాలు కోరాడ ఆశాలత (ఓసీ-వైశ్య)కు శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) అధ్యక్ష పదవి ఇచ్చారు.
-పొలాకి మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కరిమి రాజేశ్వరరావు(బీసీ-తూర్పు కాపు)కు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చారు.
-ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ, వైఎస్సార్సీపీ నాయకురాలు బల్లడ హేమమాలిని రెడ్డి (బీసీ-రెడ్డిక)కి రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ అధ్యక్ష పదవి లభించింది.
-ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నర్తు రామారావు (బీసీ -యాదవ) ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు.
-ఇచ్ఛాపురం వైఎస్సార్సీపీ నేత సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి (బీసీ-రెడ్డిక) సీడాప్ అధ్యక్ష పదవి పొందారు.
-ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ మహిళా నేత సువ్వారి సువర్ణ (బీసీ-కాళింగ) జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
-ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ మహిళా నెట్ సల్ల సుగుణ (ఎస్సీ-మాల) జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
Also Read : విశ్వసనీయతకే పట్టం, విధేయులకే పదవులు