iDreamPost
android-app
ios-app

Central minister comments -అన్నమయ్య ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు, అసలు వాస్తవాలు

  • Published Dec 04, 2021 | 3:04 AM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
Central minister comments -అన్నమయ్య ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు, అసలు వాస్తవాలు

అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగింది. అపార నష్టం జరిగింది. ఊహించని రీతలో వర్షాలు, వరదలతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయినా సుమారు మూడు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్వయంగా సీఎం కూడా బాధితులను పరామర్శించారు. భరోసా నింపారు. భవిష్యత్తుకి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి, మరింత సామర్థ్యంతో పునర్నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు వెల్లడించారు.  కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందనే ఆత్మవిశ్వాసం కల్పించారు.

ఇదంతా నాణానికి ఒకవైపు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విపత్తు జరిగింది. రాయలసీమలో గడిచిన ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నష్టం జరిగింది. పెన్నా, దాని ఉప నదులు పొంగిపొర్లడంతో జరిగిన నష్టం సుమారు రూ. 7వేల కోట్లు ఉంటుంది. ప్రాథమిక అంచనాలే రూ. ఆరు వేల కోట్లు దాటిపోయాయి. ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, వ్యవసాయం, విద్యుత్ శాఖలకు తీరని నష్టం జరిగింది. టీటీడీ కూడా విరిగిపడుతున్న కొండచరియల కారణంగా మరికొంత కాలం పాటు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి.

కేంద్రం ఏమి చేయాలి, ఏం చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ లాంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించాలి. అవసరమైన తక్షణ సహాయం ప్రకటించాలి. బాధితులకు కేంద్రం కూడా తమకు తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి. నాలుగు జిల్లాల్లో లక్షల మందికి నష్టం జరిగితే నేటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. కేంద్ర బృందాలు వచ్చి పరిశీలన చేశాయి. ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా వరద నిర్వహణ చేసిందని పేర్కొన్నాయి. అంతకుముందు ప్రధాని మోదీ నేరుగా సీఎంకి ఫోన్ చేశారు. అన్నిరకాలుగా తోడుగా ఉంటామనే హామీ మాత్రం ఇచ్చారు.

పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలు తక్షణ సహాయం కోసం ఆర్థించారు. కనీసం రూ. వెయ్యి కోట్లు ప్రకటించాలని కోరారు. కానీ నేటికీ స్పష్టత లేదు. కనీసం తాము సహాయం అందిస్తామనే మాట కూడా రాలేదు. కానీ అదే సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు మీద నీటిపారుదల మంత్రి నోరు పారేసుకున్నారు. జలవనరుల శాఖకు బాధ్యత వహిస్తున్న ఆయన వరదల విషయంలో బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు ఐదో గేటు పనిచేయకపోవడం వల్లనే ఇంత వరద వచ్చిందనే రీతిలో ఆయన వ్యాఖ్యలున్నాయి. కట్ట తెగిపోవడానికి ఆ గేటు కారణమని ఆయన వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది.

Also Read : Central Government – ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాజెక్టులకు రుణాల మంజూరు చేసేందుకు కేంద్రం సంసిద్ధం, పార్లమెంట్ లో ప్రకటన..

టీడీపీ విమర్శలేంటి, సుజనా, సీఎం రమేష్ ప్రోద్బలమేంటీ

నిజానికి ఈ వరదల సహాయక చర్యల కన్నా రాజకీయ అవసరాల కోసమే టీడీపీ తొలి నుంచి ప్రయత్నించింది. రాజంపేట, నందులూరు మండలాల్లో టీడీపీ శ్రేణులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోగా నేరుగా చంద్రబాబు రంగంలో దిగి తనని ఓదార్చాలని వరద బాధితులనుద్దేశించి వ్యాఖ్యానించడం విస్మయకరంగా మారింది. అదే సమయంలో ఇసుక తవ్వకాలను ప్రధానంగా టీడీపీ ఎత్తిచూపింది. ఇసుక తవ్వుతున్నందున ఆ వాహనాల కోసం గేట్లు సకాలంలో ఎత్తలేదని విమర్శించింది. నిజానికి 10 సెంటిమీటర్ల వర్షపాతం కురుస్తున్న దశలో ఇసుక తవ్వకాలు జరుగుతాయని కనీసం ఇంగితం ఉన్నవారెవరూ ఊహించరు. అయినా టీడీపీ విమర్శలు చేస్తూ ఈ ప్రచారమందుకుంది.

అదే సమయంలో పార్లమెంట్ లో గజేంద్ర షెకావత్ కి అండగా బాబు బ్యాచ్ కి చెందిన ప్రస్తుతం బీజేపీలోని ఇద్దరు ఎంపీలు అందించిన సమాచారమే ఇప్పుడీ వివాదానికి కారణంగా ఉంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ చెప్పిన మాటలనే షెకావత్ వల్లించడం విశేషంగానే చెప్పాలి. అన్నమయ్య ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. అంటే 26, 558 క్యూసెక్కులు. కానీ వరద ప్రవాహం సుమారుగా 4.5 లక్షల క్యూసెక్కులు. ఈ విషయంలో అధికారుల లెక్కలకు మించి వరద పోటెత్తిందనేది స్థానికుల అభిప్రాయం. ఒక్కో గేటు నుంచి నీటి విడుదల సామర్థ్యం 50వేల క్యూసెక్కులు. నాలుగు గేట్ల నుంచి దిగువకు వదలగలిగేది అత్యధికంగా 2లక్షల క్యూసెక్కులు. అంటే దాదాపు దానికి రెట్టింపు వరద వచ్చింది. పైగా నీటి విడుదల సామర్థ్యం 24 గంటలకు లెక్కిస్తే ఈ వరద మాత్రం 18వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత 19వ తేదీ ఉదయం లోగా అంటే కేవలం 4గంటల్లోనే ఎగిసిపడింది. అంటే ఈ వరద ప్రవాహం ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

మరి షెకావత్ చెబుతున్నట్టు ఐదో గేటు పనిచేసి ఉంటే మరో 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినా, మిగిలిన లక్షన్నర క్యూసెక్కుల నీరు ఎక్కడి నుంచి పోవాలి. అప్పటికే కట్ట బలహీనంగా ఉందని 2017నాటి రిపోర్టులోని అంశాలను ఏమనాలి.

అంతపెద్ద స్థాయిలో వరద వచ్చినా అపార ప్రాణ నష్టం జరగకుండా నివారించగలగడం అభినందించదగ్గ విషయం. ఉత్తరాఖండ్ లో డ్యామ్ కొట్టుకుపోయిన సమయంలో 150 మంది మరణిస్తే అన్నమయ్య ఘటనలో కేవలం రెండు ఘటనలు మినహా మిగిలిన అన్ని చోట్లా ప్రజలు ఒడ్డుకు చేరుకున్నారనే విషయం విస్మరించకూడదు. ఆర్టీసీ బస్సులో 12 మంది, ఆలయంలో మరో పది మంది చిక్కుకుపోవడం వల్లనే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందనేది గుర్తించాలి.

Also Read : Charanjeet ,Kejriwal – పంజాబ్‌లో “నల్ల ఆంగ్లేయులు” అంటూ రచ్చ..సవాళ్లు,ప్రతిసవాళ్లు

సందర్భం ఏమిటీ

షెకావత్ కామెంట్స్ చేసిన సందర్భం కూడా కీలకం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థ స్పూర్తిని దెబ్బతీసేలా అన్నింటినీ తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందనే వాదన బలపడుతోంది. విద్య, విద్యుత్ వంటి రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు దానికి ఉదాహరణలు. ఇప్పుడు సాగునీటి రంగం కూడా కేంద్రం తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా డ్యాముల భద్రత, నిర్వహణను కేంద్రం చూసుకుంటుందని ఓ చట్టం తీసుకురాబోతున్నారు.

దానికి సంబంధించి పార్లమెంట్ లో జరిగిన చర్చ సందర్భంగా షెకావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాల హక్కులను హరించేందుకు అనేక కుంటిసాకులు చెబుతున్నారనే అభిప్రాయం విపక్షాల్లో ఉంది. వాస్తవానికి అన్నమయ్య డ్యామ్ కన్నా ముందే రెండేళ్ల క్రితం ఉత్తరాఖండ్, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ పాలనలోనే డ్యాములు కొట్టుకుపోయిన సందర్భాలున్నాయి. కొండవాలు ప్రాంతంలో డ్యాముల భద్రతకు భారీ వరదల మూలంగా భరోసా లేకుండా పోతోంది. దానిని విస్మరించి ఏపీ ప్రభుత్వం మీద నిందలు వేసి, మొత్తం రాష్ట్రాల హక్కులను కొల్లగొట్టే యత్నం చేయడం బీజేపీ కేంద్ర ప్రభుత్వ కుటిలనీతికి నిదర్శనమనే వ్యాఖ్యానాలను నిపుణులు చేస్తున్నారు.

కేంద్రం స్పందించాలి

రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జాబితాలోని అంశాలను కూడా తన పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం మానుకోవాలి. అదే సమయంలో వరదలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాలి. వరదల నుంచి కోలుకునే లోగా తుఫాన్ ప్రభావం కూడా ఏపీకి తీరని నష్టం చేస్తోంది. ఇలాంటి తరుణంలో కేంద్రం విమర్శలు మానుకుని ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలి. అన్నమయ్య డ్యామ్ పునరుద్దరణ సహా వివిధ అంశాలకు ఉదారంగా చేయూతనివ్వాలి. ప్రత్యేక హోదా, పోలవరం సహా అన్ని అంశాలల్లోనూ కేవలం ప్రకటనలు తప్ప ఆచరణలో ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవడంలో విఫలమవుతున్న మోదీ ప్రభుత్వం ఈసారయినా మనసు మార్చుకోవాలి. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలి.

Also Read : Up – ఉత్తరప్రదేశ్‌… అస్థిరత్వం నుంచి స్థిరత్వం వైపు…