iDreamPost
android-app
ios-app

వన్డే సిరీస్‌లో భారత్, సౌత్ఆఫ్రికా ఆటగాళ్ళ మధ్య నో షేక్‌హ్యాండ్స్

వన్డే సిరీస్‌లో భారత్, సౌత్ఆఫ్రికా ఆటగాళ్ళ మధ్య నో షేక్‌హ్యాండ్స్

భారత్,దక్షిణాఫ్రికా మధ్య మార్చి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆటగాళ్లు క్రికెట్ సంప్రదాయాన్ని కాస్త పక్కనపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోవడం సంప్రదాయం. కానీ భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వన్డే సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవచ్చని దక్షిణాఫ్రికా టీమ్ చీఫ్ కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు.మూడు వన్డేల సిరీస్‌ కోసం సౌత్ ఆఫ్రికా జట్టు భారత్‌ గడ్డపై కాలు మోపిన సంగతి తెలిసిందే.

భారత్‌లో కరోన్ వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సిరీస్‌ కోసం భారత్‌కి బయల్దేరే ముందు గత రాత్రి దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు వైద్య సిబ్బందితో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఒక వైద్య సిబ్బంది బృందం కూడా సఫారీ క్రికెట్ జట్టుతో వచ్చింది.ఈ వైద్య సిబ్బంది సూచనలకి అనుగుణంగానే భారత పర్యటనలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నడుచుకోబోతున్నట్లు చీఫ్ కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు.

భారత్,సఫారీల మధ్య మూడు వన్డేల సిరీస్‌ మార్చి 12న ధర్మశాల మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.ఈనెల 15న లక్నో వేదికపై రెండో వన్డే జరగనుండగా,18న చివరి మూడో వన్డే మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికపై నిర్వహించనున్నారు. సిరీస్‌లో మూడు వన్డేలు డే అండ్ నైట్ మ్యాచ్‌లూ కావడంతో మధ్యాహ్నం 1.30 గంటలకి ప్రారంభంకానున్నాయి.

సఫారీలతో తలపడే భారత్ వన్డే జట్టు :

శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభమన్ గిల్