iDreamPost
android-app
ios-app

TDP Bandh-టీడీపీని బేజారెత్తించిన బంద్, బెజవాడలోనే కనిపించని ప్రభావం

  • Published Oct 20, 2021 | 1:49 AM Updated Updated Mar 11, 2022 | 10:37 PM
TDP Bandh-టీడీపీని బేజారెత్తించిన బంద్, బెజవాడలోనే కనిపించని ప్రభావం

సహజంగా ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలకు ప్రజాదరణ ఉంటుంది. ఓట్లు ఎలా ఉన్నా ఆందోళనల సందర్భంగా జనం మద్ధతు దక్కుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ సొంత వ్యవహారంతో రోడ్డెక్కింది. తన సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ప్రజలందరూ తమకు అండగా ఉంటారని ఆశిస్తోంది. కానీ ఆపార్టీ ఆశలకు గండిపడేలా ప్రజల తీరు ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీ బంద్ పిలుపుని సామాన్యులు ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన బంద్ పిలుపుతో రాష్ట్రం స్తంభించాల్సి ఉన్నా కనీసం బెజవాడలో కూడా ప్రభావం కనిపించకపోవడంతో టీడీపీ నేతలను బేజారెత్తిస్తోంది. బస్సులను అడ్డుకోవడానికి కార్యకర్తలు తెల్లవారుజామునే రోడ్డెక్కుతారని ఆశిస్తే తెలుగు తమ్ముళ్ల తీరు దానికి విరుద్ధంగా ఉండడం విశేషం.

టీడీపీ అధికార ప్రతినిది పట్టాభి నోటి దురుసు, దానికి ప్రతిగా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనలపై చంద్రబాబు బంద్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మీద పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. దాంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బద్వేలు ఉప ఎన్నికలు జరుగుతున్నా అది పెద్దగా చర్చనీయాంశం కాలేదు గానీ టీడీపీ నేతలు నోటికి పనిచెప్పడంతో తలెత్తిన పరిణామాలు దుమారం రేపుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ బంద్ పిలుపుని తాము పాటించడం లేదని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుగానే ప్రకటించింది. కరోనా ఆనంతరం దెబ్బతిన్న వ్యాపారాలను అడ్డుకోవడం సమంజసం కాదని ఛాంబర్ అధ్యక్షుడు మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థలు కూడా తెరిచే ఉంచాలని నిర్ణయించారు. సినిమా హాళ్లలో ప్రదర్శనలకు కూడా సిద్ధమవుతున్నారు. దాంతో బంద్ ప్రభావం దాదాపు శూన్యం అన్నట్టుగా మారింది. అదే సమయంలో టీడీపీ శ్రేణులు వచ్చి ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటారని అంతా ఆశించారు. ఇటీవల రైతుల సమస్యపై జరిగిన బంద్ సందర్భంగా వర్షంలో కూడా ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసనలకు దిగిన అనుభవం ఉంది. కానీ టీడీపీ నేతలు, శ్రేణులు మాత్రం విజయవాడలో ఉదయం పూట ఆందోళనలకు సిద్ధం కాలేకపోయారు. దాంతో టీడీపీ పరువు తీసుకున్నట్టవుతోందనే బెంగ ఆపార్టీలో మొదలయ్యింది.

అనువుగాని చోట అధికులమనరాదన్నట్టుగా పరిస్థితులు అనుకూలించనప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉండగా, ఏకంగా బంద్ కి పిలుపునిచ్చినా అది జరగకపోవడంతో తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయారవుతోంది. పార్టీ పరువు బజారుపాలయ్యిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ధర్నాలు, ఇతర ఆందోళనలకు పిలుపునిస్తే కొంత ఫలితం ఉండేదని, ఏకంగా బంద్ అనడంతో అనేక చోట్ల ప్రజల్లో వ్యతిరేకతతో కార్యకర్తలు రోడ్డెక్కడానికి వెనకడుగు వేసినట్టు భావిస్తున్నారు. సాయంత్రం వరకూ ఎలా ఉన్నప్పటికీ ఉదయాన్నే మాత్రం రాష్ట్రంలో యాధాతథంగా అన్ని వ్యవహారాలు సాగుతున్నాయి. టీడీపీ బంద్ కేవలం ప్రకటనలకే పరిమితమా అన్నట్టుగా కనిపిస్తోంది.

Also Read : TDP Undemocratic Behavior – ముఖ్యమంత్రి మీద టీడీపీ కుటిల రాజకీయం ఎందుకు..?