iDreamPost
iDreamPost
వాహనదారులకు మంట పుట్టిస్తున్న, నిత్యావసర వస్తువుల ధరలను రాజేస్తున్న పె్ట్రో ధరల మంట ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని స్పష్టమైంది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ప్రతిరోజూ పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ఉపశమనం కల్పిస్తారన్న ఆశలు వమ్మయ్యాయి.
సోమవారం పార్లమెంటులో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ చమురు ఉత్పత్తులను వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం జీఎస్టీ మండలి వద్ద లేదని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు సభ్యులుగా ఉన్న ఈ మండలికి ఏ రాష్ట్రం నుంచి కూడా అటువంటి ప్రతిపాదన అందలేదని, అందువల్ల ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదంటూ సాకును రాష్ట్రాలపైకి నెట్టేశారు. కేంద్రం కూడా అందులో ఒక ప్రతినిధిగా ఉన్నప్పటికీ.. తనంత తానుగా చొరవ తీసుకునేందుకు మాత్రం సుముఖంగా లేనట్లు స్పష్టమవుతోంది.
వర్తించని ఏకరీతి పన్ను విధానం
దేశమంతా ఏకరీతి పన్ను విధానం అమల్లోకి తెచ్చే క్రమంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను విధానాన్ని తీసుకొచ్చింది. అన్ని రకాల వస్తువులు, సేవలను దీని పరిధిలోకే తెస్తామని అప్పట్లో ప్రకటించిన కేంద్రం.. చివరికి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీకి బయటే ఉంచేసింది. జీఎస్టీ వసూళ్లలో రాష్రానికి సగం వాటా ఇస్తామని ప్రకటించింది.
కానీ తొలి రెండేళ్లలో వసూలు ఆశాజనకంగా లేకపోవడం, గత ఏడాదంతా కరోనా సంక్షోభంతో జీఎస్టీ రాబడి తగ్గిపోయింది. రాష్ట్రాల వాటా నిధులు విడదల చేయడంలోనూ తాత్సారం చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ పరిధిలో చేరని పెట్రో ఉత్పత్తులు కేంద్ర, రాష్ట్రాలకు కల్పతరువులా కనిపించాయి. ఎక్సైజ్ డ్యటీ, ఇంకా పలు రకాల సుంకాల పేరుతో బేస్ ధరలపై పన్నులు వేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో సుమారు మూడు లక్షల రూపాయల ఆదాయం ఈ రంగం నుంచే సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే.. పెట్రో ధరల పేరుతో ప్రజలను ఎంతగా పిండేస్తున్నారో అర్థమవుతుంది.
రోజువారీ ధరల నిర్ణయంతో నష్టం
గతంలో నెల రోజులకోసారి చమురు ధరలను సమీక్షించి.. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల ఆధారంగా సవరించేవారు. రెండేళ్ల క్రితం ఈ విధానాన్ని వీడి రోజువారీ నిర్ణయించే పద్దతిని అమల్లోకి తెచ్చారు. ధరల నిర్ణయ అధికారాన్ని చమురు ఉత్పత్తి సంస్థలకే కట్టబెట్టారు. దాంతో ఏ రోజు రేటు ఎలా ఉంటుందో తెలయకుండానే వినియోగదారుడు ధరాభారాన్ని మోస్తున్నాడు.
బేస్ ప్రైస్‌పై ధరలు పెంచుతుండటంతో.. పెంచినప్పుడల్లా అదే దామాషాలో పన్నులు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా అసలు పెంపు ఇరవై ముప్పై పైసలుగానే ఉన్నప్పటికి.. బంకు దగ్గరికి వచ్చేసరికి అర్థరూపాయి, రూపాయి తేడా కనిపిస్తోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 95 నుంచి 100 రూపాయల మధ్య కదలాడుతోంది. ఇందులో కేంద్రం పన్నులే 32.90 వరకు ఉన్నాయి.. రాష్ట్రాల పన్నులు 31 రూపాయల వరకు ఉన్నాయి. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర రాష్ట్రాలకు చెందిన రకరకాల పన్నలన్నీ పోయి.. ఒక్క జీఎస్టీ మాత్రమే మిగులుతుంది. దానివల్ల లీటర్ పెట్రోల్ ధర రూ.75కే లభిస్తుందని పలు ఆర్థికసంస్థలు, నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే జీఎస్టీ పరిధిలోకి తెస్తే పన్ను ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా దాదాపు అన్ని రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులనే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. కేంద్రం జీఎస్టీ వాటా నిధులను సకాలంలో చెల్లించకపోతుండటం.. ఆ పన్ను వసూళ్ళు ఆశించినంతగా పుంజుకోకపోవడంతో రాష్ట్రాలకు వేరే మార్గం లేకుండాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. తమ ఆదాయం పడిపోతుందన్నఆందోళన రాష్ట్ర ప్రభుత్వాల్లో నెలకొంది. అందువల్లే అవి జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తేవాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదు.
క్రూడ్ ఉత్పత్తి తగ్గడం వల్లే ధరల పెరుగుదల
దేశీయ చమురు ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఊగిసలాడుతుంటాయి. ముడిచమురు ఉత్పత్తి చేసే ఒపెక్ దేశాల సమాఖ్య ఎప్పటికప్పుడు ముడి చమురు ధరలను నిర్ణయిస్తుంటుంది. అంతర్జాతీయ పరిణామాలు, ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఈ ధరలను ప్రభావితం చేస్తుంటాయి. కాగా గత ఏడాది కరోనా లాక్‌డౌన్ సమయంలో రవాణా వ్యవస్థలు, జనజీవనం స్తంభించిన నేపథ్యంలో ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించేశాయి.
ఇప్పుడు పరిస్థితులు కుదుటపడి.. అన్ని రంగాలు గాడిలో పడినా చమురు ఉత్పత్తి పెంచడంపై ఒపెక్ దేశాలు దృష్టి పెట్టడం లేదు. ప్రధానంగా ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడిన మన దేశం.. తన అవసరాలకోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ అమెరికా, రష్యా తదితర దేశాల నుంచి దిగుమతులు పెంచుకుంటోంది. దీనివల్ల విదేశీమారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిణామాలన్నీ దేశీయ చమురు ధరలను ప్రభావితం చేస్తూ.. వాటి పెరుగుదలకు కారణమవుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. ఉత్పత్తి, ఎగమతులు పెంచమని ఒపెక్ దేశాలను కోరామని.. ఆ రెండు జరిగితే పెట్రో ధరలు అదుపులోకి వస్తాయని కేంద్రం చెబుతోంది.