iDreamPost
android-app
ios-app

దేశంలో ఒకరికొకరు.. యూపీలో ఎవరికివారు

  • Published Jun 28, 2021 | 12:02 PM Updated Updated Jun 28, 2021 | 12:02 PM
దేశంలో ఒకరికొకరు.. యూపీలో ఎవరికివారు

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం అప్పుడే జాతీయ స్థాయిలో రాజకీయ పావులు కదులుతున్నాయి. ఎన్డీయేకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు భవసారూప్యత గల పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అన్ని పార్టీలు ఏకమైతే తప్ప మోదీని గద్దె దించలేమని భావిస్తున్న పార్టీలు.. ఆ లక్ష్య సాధనకు ఐక్యత రాగం ఆలపిస్తూ.. పరస్పర సహకారంతో ముందుకెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలతో.. శరద్ పవార్ కేంద్రంగా ఏకీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే జాతీయస్థాయిలో ఎన్డీయే, మోదీలకు వ్యతిరేకంగా ఏకమవ్వాలనుకుంటున్న విపక్షాలు.. అతి కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మాత్రం ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని, బీజేపీని దెబ్బ కొట్టాలంటే.. అంతకుముందు వచ్చే మార్చిలోనే జరిగే యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరాన్ని విస్మరిస్తున్నాయి. పెద్ద రాష్ట్రమైన యూపీలోనే అత్యధిక లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఆధిక్యత సాధించే పార్టీయే కేంద్రంలో అధికారంలోకి రాగలుగుతుందన్నది సుస్పష్టం. విపక్షాలు మాత్రం ఇక్కడ వదిలేసి.. ఏకంగా జాతీయస్థాయిలో బీజేపీని కొట్టేయాలని తహతహలాడుతున్నాయి.

ఒంటరి పొరుకే పార్టీలు సై

వచ్చే మార్చిలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని అక్కడ పెద్ద పార్టీలుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ప్రకటించాయి. జాతీయ పార్టీల్లో ఒకటైన బీజేపీ దాదాపు ఒంటరిగానే బరిలో దిగుతోంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెసుతో జతకట్టేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకొని 100 సీట్లు కేటాయించింది. ఆ వంద సీట్లనే గెలవలేక కాంగ్రెస్ చతికిలపడటంతో తాము నష్టపోయామని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అంటున్నారు. అలాగే 2019 లోక్ సభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఈసారి పొత్తుల్లేకుండా ఎన్నికలు ఎదుర్కోవాలని అఖిలేష్ నిర్ణయించుకున్నారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటాయని ఇటీవల వార్తలు వచ్చాయి. దళితులు, మైనార్టీల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు అవి కలుస్తున్నాయన్న ప్రచారాన్ని మాయావతి కొట్టిపారేశారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. పంజాబులో మాత్రం ఆకాలీదళ్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఇక ఒకప్పుడు యూపీని ఏకాచత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పరిస్థితి దీనంగా మారింది. ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయిన ఆ పార్టీని కలుపుకొని వెళ్లేందుకు ఏ పార్టీ కూడా సిద్దంగాలేదు. దాంతో ఆ పార్టీకి ఒంటరి పోరు తప్ప మార్గాంతరం లేదు.

మహా ఘటబంధన్ వైఫల్యం

గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీలు మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి మహా ఘటబంధన్ గా ఏర్పడి పోటీ చేశాయి. అయినా బీజేపీని నిలువరించలేకపోయాయి. ఆ ఎన్నికల్లో యూపీలో మొత్తం 80 లోక్ సభ సీట్లకు గాను బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5, అప్నాదళ్ 2 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ సోనియాగాంధీ సీటు రాయబరేలీ తప్ప ఎక్కడా గెలవలేదు. ఆ చేదు అనుభవంతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికివారుగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాయి. అయితే దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి.. అంతిమంగా బీజేపీకే లబ్ది చేకూరుతుందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నాయి. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఎన్నికల్లో దెబ్బ తీస్తుందేమోనన్న ఆందోళనతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన బీజేపీ నేతలకు తాజా పరిణామాలు ఊరట కలిగిస్తున్నాయి.

Alao Read : ఆ ఉప ఎన్నిక.. లక్ష్మీపార్వతి ఎన్నిక.. అంతా అనూహ్యమే!