iDreamPost
iDreamPost
వైఎస్సార్ మరణం తర్వాత కుచించుకుపోతూ వచ్చిన కాంగ్రెస్ ఇక తెలుగు నేల మీద ఆశలు వదులుకున్నట్టేనా అనే సందేహం కలుగుతోంది. తాజాగా సీడబ్ల్యూసీ లో తెలుగు నేతలకు చోటు దక్కకపోవడం దానికో నిదర్శనం. పలువురు సీనియర్లను పక్కన పెట్టి కొత్త నేతలతో కీలక కమిటీలు నింపేసిన కాంగ్రెస్ అధిష్టానం ఉభయ తెలుగు రాష్ట్రాలను విస్మరించింది. ఆపార్టీ చరిత్రలో తెలుగు నేతలకు సీడబ్య్ల్యూసీలో చోటు లేని పరిస్థితి ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఆపార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణాలో విపక్షంగా ఉన్నప్పటికీ పార్టీలో నిస్తేజం స్పష్టంగా కనిపిస్తోంది. నేతల మధ్య కానరాని సఖ్యత కారణంగా ప్రతిపక్ష హోదాలో కూడా పట్టు నిలుపుకోలేని స్థితిలో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో జాతీయ స్థాయి మార్పులకు అనుగుణంగా సీడబ్య్ల్యూసీ పునర్నియామకంలో ఎవరో ఒకరికి చోటు కల్పించకపోతారా అనే చర్చ సాగింది. పలువురు సీనియర్లు కూడా ఆశతో కనిపించారు. కానీ సోనియా గాంధీ మాత్రం తెలుగునేతలను పూర్తిగా దూరం పెట్టేసినట్టుగానే చెప్పవచ్చు
అదే సమయంలో ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాంనబీ ఆజాద్ తొలగింపు పూర్తి చేశారు. ఇటీవల సోనియా కి వ్యతిరేకంగా లేఖాస్త్రాలు సంధించిన తర్వాత క్రమంగా ఆయన ప్రాధాన్యత తగ్గుతున్న విషయం తెలిసిందే. ఇక కీలకమైన యూపీలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ప్రియాంక గాంధీ ని నియమించారు. ఆజాద్‌తో పాటు అంబికాసోనీ, మోతీలాల్ ఓరా, మల్లికార్జున ఖర్గే వంటి నేతలను కూడా పక్కన పెట్టేశారు. ఏఐసీసీ నుంచి పలువురు సీనియర్లు తొలగింపు ప్రక్రియలో పదవులు కోల్పోయారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మణికం ఠాగూర్ ని నియమించారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఊమెన్‌చాందీ కొనసాగుతారని ప్రకటించారు.
ఇక వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుల జాబితాలో కూడా ఏపీ, తెలంగాణా నుంచి ఒక్కరికీ ఛాన్స్ దక్కలేదు. ప్రత్యేక ఆహ్వానితుల్లో మాత్రం చింతా మోహన్, ఐఎన్టీయూసీ కోటాలో జీ సంజీవ రెడ్డి కొనసాగుతున్నారు. దాంతో తాజా నియామకాలు ఇప్పుడు ఆపార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.