వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో తిరుగులేని ఓ అద్భుతమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో వెలుగొందిన కాంగ్రెస్ పార్టీ… స్థిరమైన రాజకీయాలతో వైఎస్ఆర్ హయాంలో నడిచిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అత్యంత దుర్భరమైన పరిస్థితిలో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి…. ఇప్పుడు కనీసం ఆఫీస్ బేరర్ లను సైతం వేసుకో లేనంత దీనమైన స్థితిలో కి వెళ్తున్నట్లు ఉంది. కేంద్ర కమిటీలోనూ ఊగిసలాట ధోరణి.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎంపికలోనూ అలసత్వ ధోరణి.. అయోమయం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అసలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. కనీసం కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులను, నిర్వహించడానికి సైతం రాష్ట్ర నాయకులు ఎవరూ సిద్ధంగా ఉండడం లేదన్నది సమాచారం.
యువజన రైతు విభాగలు ఖాళీ!
ఒకప్పుడు కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు అంటే దాదాపుగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడుతో సమానమైన హోదాలో ఉండేవారు. ఆ పదవికి సైతం వివిధ వర్గాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి నాయకుల నుంచి తీవ్రమైన పోటీ ఉండేది. కొందరు నాయకులు తమ వారికి ఆ పదవి పంచుకోవడం కోసం జాతీయ స్థాయిలో సైతం లాబీయింగ్ చేసేవారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఇటీవల వరకూ పని చేసిన చిత్తూరు జిల్లా నగిరి కి చెందిన రాకేష్ రెడ్డి వివిధ కారణాల రీత్యా ఆ పార్టీని వదిలి పెట్టడం తో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం పూర్తిగా మానేశారు. మొదట్లో ఈ పదవికి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పార్టీలోని ఆఫీస్ బేరర్ల తో… సభ్యులతో ఓటింగ్ నిర్వహించి మరీ రాకేష్ రెడ్డి పదవిని పొందారు. అయితే తర్వాత తర్వాత ఆయన కాంగ్రెస్లో కొనసాగడం కేవలం.. నగిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవడం అక్కడ కూడా సరైన ప్రాతినిధ్యం మద్దతు లేకపోవడంతో రాకేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వదిలేశారు. దీంతో పాటు ఆయన నాయకుల ఫోన్లకు పార్టీ కార్యక్రమాలకు రావడం మానేశారు. దీంతో ఇటీవల ఆయనను క్రమశిక్షణ చర్యల కింద యువజన విభాగం అధ్యక్షుడిగా తీసేశారు.
అయితే కొత్త వ్యక్తులను చూసి పదవి అప్పగించాల్సిన రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు దానికి ముందుకు రాకపోవడంతో ఆ బాధ్యతను వారే తలకేట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సాకే శైలజానాథ్ అని ఆ పదవి కూడా అదనంగా నిర్వహించమని కాంగ్రెస్ నాయకులు ఇటీవల తీర్మానం చేయడం విశేషం. అలాగే ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న కిసాన్ రైతు అధ్యక్షుడు పదవిని సైతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తులసిరెడ్డి నిర్వహించాలని తీర్మానం చేశారు. దానికి తగిన ఉత్తర్వులు సైతం ఇటీవల వచ్చాయి. కనీసం కొత్త నాయకులు యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ కరువవడం కాంగ్రెస్ పార్టీ యువజన బాధ్యతలను నిర్వర్తించే సమర్థవంతమైన నాయకులు లేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ మనుగడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నలను లేవనెత్తుటోంది.
ఎవరు ఇంచార్జి?
ఏపీ కాంగ్రెస్ కు ఇన్చార్జి హోదా కోసం జాతీయ నాయకులు గతంలో పోటీపడేవారు. బాగా సీనియర్లు అయిన వారు మాత్రమే ఏపీ కు ఇన్చార్జిగా వచ్చేవారు. ఎన్.డి.తివారీ, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, షిండే వంటి మహామహులు ఏపీ కాంగ్రెస్కు ఇన్చార్జిలుగా వ్యవహరించిన వారు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడడంతో ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సైతం జాతీయ నాయకులు ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో పూర్తిస్థాయి ఇన్చార్జిగా కాంగ్రెస్ బాధ్యతలు చూసేందుకు పార్టీని ఒక దిశలో నడిపేందుకు సైతం జాతీయ నాయకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఈ ధోరణి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి చూడబోతున్న అన్నది స్పష్టం చేస్తోంది