iDreamPost
iDreamPost
దీపావళీ పండగ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2022లో జరగనున్న నేపధ్యంలో ఆ ఎన్నికల్లో తమ పార్టీ అనుసరించబోయే వ్యుహాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే బీజేపి పార్టీ అభివృద్ది కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు.
2017 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఘోరంగా విఫలమైన నేపధ్యంలో ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టితో కాని మరే ప్రముఖ పార్టీతో కానీ తాము కూటమిగా ఏర్పడబోవటంలేదని, కేవలం చిన్న పార్టీలతో మాత్రమే కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయిని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు వేదికలపై తెలిపానని ఆయన గుర్తు చేశారు. 2017 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా జస్వంత్‌నగర్ నుంచి పోటీ చేసిన శివపాల్ యాదవ్ అనంతరం ఎస్పీ నుంచి బయటకు వచ్చి 2019లో సొంతంగా ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు.
అయితే ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే శివపాల్ యాదవ్‌ను యుపి అసెంబ్లీ నుంచి అనర్హులుగా ప్రకటించాలన్న విజ్ఞప్తిని కొన్ని వారాల క్రితం ఎస్పీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే, ఈ చర్యను ఎస్పీ చీఫ్ తన బాబాయ్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి తీసుకున్న చర్యగా అందరు భావించారు. శివపాల్ యాదవ్ కూడా తన వంతుగా, అనర్హత దరఖాస్తును వెనక్కి తీసుకున్నందుకు అఖిలేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడి కూటమి విఫలమై అంతిమంగా బీజేపీ లబ్దిపొందిన నేపద్యంలో , ఇక రానున్న ఎన్నికల్లో 2012 మాదిరే ఒంటరిగా బరిలోకి దిగాలని అఖిలేష్ నిశ్చయించుకున్నటు కనిపిస్తుంది.