iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ లేదు..! – రాత్రి కర్ఫ్యూ విధిస్తే చాలు : మోదీ

లాక్ డౌన్ లేదు..! – రాత్రి కర్ఫ్యూ విధిస్తే చాలు : మోదీ

దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో గురువారం సమీక్షించారు. కోవిడ్‌ని కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో టెస్టింగ్‌ చేయాలని, ట్రేసింగ్‌, ట్రాకింగ్‌ చేపట్టాలని సూచించారు. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

70శాతం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేయించాలి..!

కేసులు భారీగా నమోదవుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మోదీ తెలిపారు. కోవిడ్ కట్టడికి లాక్ డౌన్ మాత్రమే పరిష్కారం కాదని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారని, ఇదే విధానాన్ని మిగిలిన రాష్ట్రాలు పాటించాలన్నారు. మొత్తం టెస్టుల్లో 70శాతం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, భారీగా పాజిటివ్‌ కేసులు వస్తున్నా.. భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్..!

శాంపిల్స్‌ సేకరణ అత్యంత కీలకమని, ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌గా నిర్వహించాలని ముఖ్యమంత్రులకు పీఎం సూచించారు. రెండో దశలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందన్న ప్రధాని.. మరోసారి మనం కఠిన సవాల్‌ ఎదుర్కొంటున్నామని మోదీ పేర్కొన్నారు. కొవిడ్ టీకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, వచ్చే మూడు వారాలు భారత్‌కు మరింత కీలకమని తెలిపారు. టెస్టుల విషయంలో నిర్లక్ష్యం, పొరపాట్లు చేయొద్దని హితవుపలికారు. మన దేశంలోనే వ్యాక్సిన్ల లభ్యత ఎక్కువగా ఉందని, ఒక్క రోజులోనే 40లక్షల మందికి టీకాలు వేయగలిగామని చెప్పారు.

ఆ మూడు రాష్ట్రాల్లో అధికం!

మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ కంటే ఎక్కువ తీవ్రత ఉందని మోదీ తెలిపారు. పలు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందని గుర్తుచేశారు. వ్యాక్సినేషన్‌ కన్నా పరీక్షలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ల సంఖ్యను భారీగా పెంచాలని, అందరూ తప్పనిసరిగా కోవిడ్‌ టెస్టులు చేయించుకోవాలన్నారు.

45 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలి

ఫస్ట్‌ వేవ్‌ను జయించాం.. సెకండ్‌ వేవ్‌ను కూడా జయించగలం అనే నమ్మకం ఉందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడొద్దని ధైర్యం చెప్పారు. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఒక ప్రత్యామ్నాయం అని, 45 ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు.