iDreamPost
android-app
ios-app

మణిపూర్‌ సిఎం బీరెన్‌పై అవిశ్వాస తీర్మానం: సిద్ధమైన కాంగ్రెస్‌..!

మణిపూర్‌ సిఎం బీరెన్‌పై అవిశ్వాస తీర్మానం: సిద్ధమైన కాంగ్రెస్‌..!

మణిపూర్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి సంకట స్థితి ఎదురు కానుంది. ఇటీవల కొంచెంలో తప్పించు కున్న రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌ సింగ్‌పై ఆగస్టు 10న జరగనున్న ఒక్క రోజు అసెంబ్లీ సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కైషం మేఘ చంద్ర ప్రకటించారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఆలోచనలో పడ్డారు.

అయితే అసెంబ్లీలో తమ బలం నిరూపించుకుంటామని బీరెన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్‌లో సంకీర్ణ ప్రభుత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన నలుగురు మంత్రులు..మంత్రి పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీంతో సీఎల్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓక్రామ్‌ ఓబోరు..బల నిరూపణ నిమిత్తం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని గవర్నర్‌ నజ్మా హెప్తుల్లాను కోరారు.

అయితే దానికి గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. అంతలోనే బిజెపి అదిష్టానం పావులు కదపడంతో ఎన్పీపి నేతలు తిరిగి సంకీర్ణ ప్రభుత్వానికి తిరిగి వచ్చారు. గత నెలలో తలెత్తిన రాజకీయ అనిశ్చితి, ఇతర సమస్యల దృష్ట్యా కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానానికి మొగ్గు చూపుతోంది. అయితే మణిపూర్‌లోని ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లీసెంబా సనాజోబాకు ఓటు వేసినందుకు క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ కాంగ్రెస్‌ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు ఇద్దరు అసమ్మతి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆర్‌కె ఇమో, ఎక్రామ్‌ హెన్రీ ఇంకా స్పందించ లేదు.

అదే సమయంలో స్పీకర్‌ యుమ్నం ఖేమ్‌ చంద్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించనున్నాయి. కరోనా కేసులు పెరగడంతో పాటు, డ్రగ్స్‌ బిజినెస్‌లో ఉన్నతాధికారులు హస్తముండటంపై ఒక మహిళా అధికారి కోర్టులో దాఖలు చేసిన అఫివిట్‌ వంటి సమస్యలను లెవనెత్తుతామని మేఘచంద్ర తెలిపారు. మీడియా కథనాల ప్రకారం కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు బిజెపి చేతులు కలపడం సిగ్గు చేటని అన్నారు.

వచ్చే నెలలో ఒక్క రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏకరువు పెడతామని చెప్పారు. మణిపూర్‌ ప్రభుత్వం సిఫారసు లేకుండా వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సీఎల్పీ నేత ఓక్రామ్‌ ఐబోబికి జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ తొలగించారనీ, రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగుతుందో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు.