iDreamPost
iDreamPost
కాకినాడ నగర మేయర్ సుంకర పావనిపై పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్ నియమించిన జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షతన సమావేశం ప్రారంభం అవుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పావని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమకు విలువ ఇవ్వలేదని, మహిళా కార్పొరేటర్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ పలువురు కార్పొరేటర్లు గత నెల 17న కలెక్టర్ హరికిరణ్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
శిబిరంలో అసమ్మతి కార్పొరేటర్లు..
అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేసిన 33 మంది కార్పొరేటర్లు విశాఖలో ఏర్పాటు చేసిన రాజకీయ శిబిరానికి తరలి వెళ్లారు. వీరిలో చాలామంది కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు. వీరందరూ సోమవారం రాత్రికి కాకినాడ చేరుకుంటారు. మంగళవారం ఓటింగ్‌కు హాజరు కానున్నారు.
Also Read : వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ : ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం
మేయర్ కు అందరూ దూరం..
ఇప్పటికే మేయర్ పావనికి వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి కార్పొరేటర్లతో పాటు సొంత పార్టీ టీడీపీకి చెందిన మిగిలిన తొమ్మిది మంది కూడా ఆమెకు దూరమయ్యారు. టీడీపీ జారీ చేసిన విప్‌ను కూడా ధిక్కరించేందుకు వారు సమాయత్తమవుతున్నారని సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడును రెండు రోజుల క్రితం ఈ తొమ్మిది కార్పొరేటర్లూ నేరుగా కలిసి తమ వాదన వినిపించినట్టు తెలిసింది. మేయర్ పావని సొంత పార్టీలోని కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, ఆమెకు అనుకూలంగా ఓటు వేయలేమని చెప్పారని అంటున్నారు. ఓవైపు అసమ్మతి కార్పొరేటర్లు, మరోవైపు సొంత పార్టీలోని కార్పొరేటర్ల నుంచి కూడా అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో మేయర్ ఒంటరిగా మిగిలారు.
Also Read : టీడీపీ నేతలకు కొత్త తలనొప్పి, సీట్ల మార్పు మీద కుస్తీ
స్టేకు యత్నించిన మేయర్..
కాకినాడ కార్పొరేషన్ లో తనపై కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై అభ్యంతరాలు తెలియజేస్తూ మేయర్ సుంకర పావని వేసిన కేసు ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. తనపై అవిశ్వాస తీర్మానంపై కార్పొరేటర్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి మేయర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి హైకోర్టులో ఇరువర్గాల వాదనలు విన్నారు. మేయర్ న్యాయవాదులతోపాటు, ప్రభుత్వ న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం కేసును 22వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. సమావేశం నిలుపు చేయమని కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వనందున అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందటానికి ఏ ఆటంకం లేదని కార్పొరేటర్లు అంటున్నారు. మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ -1 కాలా సత్తిబాబుపై కూడా అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నట్టు కార్పొరేటర్లు చెబుతున్నారు.
Also Read : ఉత్తరాంధ్రలోని మారుమూల గ్రామం ప్రధాని దృష్టికి ఎలా వెళ్ళింది?
నంబర్ గేమ్ లో మేయర్ వెనకడుగు..
ముగ్గురు మృతి చెందడం, ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మూడు ఎక్ష్ అఫీషీయో ఓట్లు ఉన్నాయి. దీంతో మొత్తం ఓట్లు 47 అవుతాయి. సభ కోరం పూర్తి కావాలంటే 31 మంది సభ్యులు హాజరు కావాలి. హాజరైన వారిలో సగం కన్న ఒక్క ఓటు ఎక్కువగా అవిశ్వాసానికి మద్దతుగా వస్తే మేయర్ కౌన్సిల్ విశ్వాసం కోల్పోతారు. ఆ విషయాన్ని కలెక్టరు ప్రభుత్వానికి నివేదిస్తారు. అప్పుడు ప్రభుత్వం మేయర్ను అనర్హురాలిగా ప్రకటిస్తుంది. ఆ తరువాత కొత్త మేయర్ ఎన్నికకు కలెక్టర్ ఒక తేదీని ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం జరగనున్న ఓటింగ్‌పై పడింది.
Also Read : చంద్రబాబు మరో పాదయాత్ర ?