iDreamPost
iDreamPost
లాక్ డౌన్ దాదాపుగా సడలించినా ఇంకా షూటింగులు పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. నిబంధనలకు అనుగుణంగా చేసుకోండని తెలంగాణా ప్రభుత్వం చెప్పేసింది కానీ హైదరాబాద్ లో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆ సాహసాన్ని మనవాళ్ళు చేయలేకపోతున్నారు. తక్కువ క్రూతో జరుపుకునే టీవీ సీరియల్స్ కే కరోనా గండం తప్పలేదు. ఇప్పటికి నలుగురు బాధితులయ్యారు. ఇంకొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని తారలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిర్మాతలు సైతం డిమాండ్ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉండగా కొద్దిశాతం మాత్రమే బాలన్స్ ఉన్న వెంకటేష్ నారప్ప, రానా విరాటపర్వం ఈ ఏడాదే రావొచ్చనే అంచనాలో అభిమానులు ఇప్పటిదాకా ఉన్నారు.
ఒకవేళ అక్టోబర్ లో పరిస్థితి నెమ్మదించినా నవంబర్ లో వేగంగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని డిసెంబర్ కంతా ఫస్ట్ కాపీని సిద్ధం చేసుకోవచ్చు. కానీ ఇదంతా వినడానికి ఈజీగా ఉంది కానీ ఆచరణలో మాత్రం కాదు. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు సంబంధించిన కీలకమైన ఎపిసోడ్లలో ఎక్కువ సంఖ్యలో యూనిట్ సభ్యులు, జూనియర్ ఆర్టిస్టులు అవసరమవుతారట. ఏ చిన్న పొరపాటు లేదా నిర్లక్ష్యం పెను ప్రమాదానికి దారి తీయొచ్చు. అందుకే ఇంకో రెండు మూడు నెలలు వేచి చూసే ఆలోచనలో సురేష్ సంస్థ ఉంది. ఆలోగా రానా పెళ్లి పనులు తదితర వ్యవహారాలు జరిగిపోతాయి. తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ సంవత్సరమే ఉంటుందన్నది ఫిక్స్ .
సంక్రాంతికి చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ ఎలాగూ డ్రాప్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఒక్కటే రేస్ లో నిలిచే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నారప్ప, విరాట పర్వం ఒకదానికి రేస్ లో ఛాన్స్ ఇవ్వొచ్చు. అంతే తప్ప 2020లో వెంకీ,రానాలు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. నారప్పకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా విరాట పర్వం వేణు ఊడుగుల డైరెక్షన్లో రూపొందుతోంది. అంచనాలూ భారీగా ఉన్నాయి. తర్వాత చేయబోయే సినిమాల గురించి వెంకటేష్ ఇప్పటికే చర్చల్లో ఉన్నారు. శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆల్రెడీ లీక్ వచ్చేసింది. ఇంకా రానా చేయబోయే భారీ విజువల్ వండర్ హిరణ్యకశిప తాలూకు స్క్రిప్ట్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పదమూడు కోట్ల రూపాయలు సెట్ కు వెళ్లకుండానే ఖర్చయ్యాయట. మొత్తానికి దగ్గుబాటి సినిమాల కోసం ఫ్యాన్స్ కాస్త ఎక్కువే ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది.