Idream media
Idream media
నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఓ రూ.10 వేలు జీతం వచ్చే ఉద్యోగం వస్తే అంతకంటే హాయి ఏముంటుందని అనుకుంటారు. తీరా ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత…బ్బా ఆదాయం వచ్చే శాఖ అయితే బాగుంటుందని ఆశిస్తాం. అంతే తప్ప ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే చాలని ఏ మాత్రం ఆలోచించం. బహుశా వ్యవస్థలోని లోపాలే మనిషిలో ఇలాంటి ఆలోచనలు కలగడానికి కారణమేమో.
బాగా అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతానికి పోస్టింగ్ వస్తే రోజూ పండగే అని పోలీసుశాఖలో హోంగార్డు మొదలుకుని ఉన్నత స్థాయి అధికారుల వరకు సంబరపడతారు. భూముల ధరలు బాగా ఉండటంతో పాటు భూవివాదాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పోస్టింగ్‌ను రెవెన్యూ ఉద్యోగులు కోరుకుంటారు. ఇందుకోసం ఎంత డబ్బైనా రాజకీయ నాయకులకు లంచంగా ఇచ్చి పోస్టింగ్‌ను తెచ్చుకునేవారు లేకపోలేదు. పోలీసు, రెవెన్యూ…ఇవే కాదు…బాగా బడ్జెట్ ఉన్న సర్వశిక్ష అభియాన్, ఇతర డిపార్ట్‌మెంట్లలో పోస్టింగ్ కోసం తహతహలాడటం వెనక ఆదాయమే అంతిమ లక్ష్యం.
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కంభం తహశీల్దార్ కార్యాలయంలో, బయట ఓ ఫ్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.
“ఈ కార్యాలయంలో ఏ పనికీ …ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే తహశీల్దార్, ఆర్డీవోలకు సమాచారం ఇవ్వండి” అనేది ఆ ఫ్లెక్సీ సారాంశం. నిజాయితీగా సేవలందించాలన్న ఉద్దేశంతోనే వాటిని పెట్టామని తహశీల్దార్ శ్రీనివాసరావు చెప్పడం అభినందనీయమే.
ప్రధానం అవినీతి అంటే రెవెన్యూ శాఖే గుర్తుకొస్తుంది. బర్త్ సర్టిఫికెట్ అయినా, డెత్ సర్టిఫికెట్ అయినా రెవెన్యూ సిబ్బందికి లంచం ఇవ్వనదే పని జరగడం లేదు. లంచం ఇవ్వకుంటే జీవిత కాలమైనా పనులు జరగవనే భయమే సిబ్బందికి డబ్బు ఇచ్చేందుకు ఉసిగొల్పుతోంది.
ప్రధానం రెవెన్యూలో ఉద్యోగమంటే తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశంగా ఉద్యోగులు భావించడం మానేయాలి. ప్రజలకు సేవ చేసే అవకాశంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ఉద్యోగమనే స్పృహ ఉద్యోగుల్లో రానంత వరకు ఇబ్బందులే. ఇప్పుడిప్పుడే రెవెన్యూ ఉద్యోగుల్లో మార్పు వస్తుందనేందుకు కంభంలో కట్టిన ఫ్లెక్సీలే నిదర్శనమని చెప్పొచ్చు.