ఏలూరు రాజకీయాలకు ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడి నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో సైతం అదే పార్టీ అధికారంలో ఉంటుందని చాలా మంది భావిస్తారు. అందులోనూ కీలకమైన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం కావడంతో నియోజకవర్గ రాజకీయాలను జిల్లా ప్రజలు తరిచి చూస్తారు. నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఒక పార్టీ వైపు లేరు. అందుకే ఇక్కడ గెలుపు సులభంగా దక్కదు అని నేతలు భావిస్తారు. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం లో విపక్ష పార్టీ తెలుగుదేశానికి నేతల కొరత వచ్చి పడింది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరణం తర్వాత ఆ పార్టీ ఆయన లేని లోటును పుడ్చుకోలేకపోతుంది.
ఏలూరు తెలుగుదేశం పార్టీ నేత బడేటి బుజ్జి ఆకస్మిక మరణం తర్వాత నియోజకవర్గ టిడిపి బాధ్యుడిగా ఆయన తమ్ముడు బడేటి చంటి బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పటివరకు రాజకీయాలంటేనే టచ్ లేని చంటి ఒక్కసారిగా అన్నయ్య బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. అయితే అనుభవలేమి, కార్యకర్తలు నాయకులు చెల్లాచెదురు కావడం, ఇతర కారణాల రీత్యా ఏలూరు నగరంలో టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సక్రమంగా చేయలేని పరిస్థితి ఉంది. ఇటీవల గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇచ్చిన నిరసన ఏలూరు లో ఫెయిల్ అయింది. అలాగే గుంటూరు లో రమ్య హత్య కేసుకు సంబంధించిన నిరసన కార్యక్రమాలను కేవలం టీఎన్ఎస్ఎఫ్ నేతలు నిర్వహించారు. దీంతో తెలుగుదేశం పార్టీకీ ఎలక నియోజకవర్గంలో దశ దిశ కనిపించడం లేదు.
గతంలో బడేటి బుజ్జి రాజకీయాల్లో కీలకంగా ఉన్న సమయంలో దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా నియోజక వర్గం లో బలమైన క్యాడర్ ను తయారు చేసుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తో సన్నిహితంగా ఉండటం, కార్యక్రమాలను సైతం దూకుడుగా నిర్వహించగల సత్తా ఉన్న బడేటి బుజ్జి మరణం తర్వాత నియోజకవర్గంలోనీ తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక రకమైన నిశ్శబ్దం నెలకొంది. బుజ్జి రాజకీయ వారసుడిగా తమ్ముడు చంటి వచ్చినా మునుపటి దూకుడు కనిపించడం లేదు అన్నది టీడీపీ కార్యకర్తల మాట.
Also Read : అయ్యో..పవన్ కళ్యాణ్ పెళ్లికెళ్లి, పొలిటికల్ మైలేజీ యత్నం చేస్తున్నారా
బడేటి చంటి కీ చొరవ తక్కువ. అందరినీ కలుపుకుపోయే స్వభావం అంతంత మాత్రమే. అప్పటివరకు వ్యాపారంలో కొనసాగిన చంటి ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడి పరిస్థితికి తగ్గట్టుగా వ్యవహరించ లేకపోతున్నారు అన్నది టీడీపీ నాయకులే చెబుతున్న మాట. దీనికి తోడు ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని దూకుడు శైలి కీ తగ్గట్టుగా ఏ మాత్రం చంటి ముందుకు సాగలేక పోతున్నారు. సొంత పార్టీ నేతలను, కార్యకర్తలను సైతం కాపాడుకోవడంలో చంటి వెనుకబడ్డారు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
గతంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని గెలుచుకున్న టిడిపికి కనీసం డివిజన్లలో అభ్యర్థులు దొరక్కపోవడం నాయకుడి వైఫల్యం కిందనే రాష్ట్ర పార్టీ భావించింది. అప్పట్లోనే దీనిపై రాష్ట్రస్థాయి నేతలు బడేటి చంటి తో మాట్లాడారు. నియోజకవర్గంలో కీలకం గా ఉండాలని, పూర్తిస్థాయిలో ప్రజల్లో పనిచేయాలని సూచించినప్పటికీ ఆ సూచనలు ఇప్పటి వరకు అమలు చేసిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు, ప్రెస్ మీట్ లు నిర్వహించడం తప్ప బడేటి చంటి ప్రజల్లో తిరిగిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఏలూరు కీలకమైన నియోజకవర్గంలో ఏం చేయాలన్న విషయాన్ని రాష్ట్ర పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏలూరు నియోజకవర్గంలో బలమైన నేతలు కనిపించకపోవడం టిడిపి నాయకులు ఆలోచనలో పడేస్తోంది. గతంలో టిడిపి తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మారడాని రంగారావు, ఒకసారి టిడిపి తరఫున గెలిచిన అంబికా కృష్ణ లు ప్రస్తుతం టిడిపి లో లేరు. వారి తర్వాత నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన బడేటి బుజ్జి ఇటీవల మరణించారు. దీంతోపాటు ఏలూరు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలను తయారు చేయడంలో టిడిపి విఫలం అయింది అన్న వాస్తవం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.
బడేటి బుజ్జి మరణం తాలూకా సానుభూతి కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లాభం తెచ్చిపెట్టేది అయినా, దానిని సమర్ధంగా వాడుకోవడంలో, ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మాత్రం బడేటి చంటి అనుకున్న మేర సఫలీకృతులు కాలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు బడేటి బుజ్జి ప్రత్యామ్నాయం ఏమిటో దారి తెలియని స్థితిలో టిడిపి పడింది. కీలక నియోజకవర్గాన్ని ఎవరి చేతిలో పెట్టాలో తెలియక టిడిపి రాష్ట్ర నాయకత్వం మదన పడుతోంది.
Also Read : ఆ నియోజకవర్గంలో అధికారపార్టీలో లోల్లి ..టీడీపీ గురి..!