iDreamPost
android-app
ios-app

విరాటపర్వంలో చిత్రలహరి భామ

  • Published Dec 11, 2020 | 7:30 AM Updated Updated Dec 11, 2020 | 7:30 AM
విరాటపర్వంలో చిత్రలహరి భామ

శ్రీవిష్ణు హీరోగా రూపొందిన మెంటల్ మదిలో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నివేత పేతురాజ్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు బాగానే చేసింది. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ రోషగాడు అంతగా ఆడనప్పటికీ ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురాలతో వరస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అల వైకుంఠపురములో చేసింది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తన ఆశలన్నీ రామ్ రెడ్ మీదే ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ గా కథను కీలక మలుపులు తిప్పే క్యారెక్టర్ లో మంచి స్కోపే దక్కించుకుంది. లాక్ డౌన్ నుంచి విడుదల వాయిదా పడుతూ వచ్చిన రెడ్ సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటోంది. ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

తాజాగా విరాట పర్వంలోనూ నివేత ఓ కీలక పాత్ర చేయబోతోంది.ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో జరిగే షూటింగ్ లో జాయిన్ అయ్యింది . అధికారికంగా ఈ మేరకు తన పుట్టినరోజు సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. బాలీవుడ్ ప్రముఖ నటి నందితా దాస్, ప్రియమణిలు కూడా ఇందులో నటించారు. లాక్ డౌన్ లో ఆగిపోయిన షూటింగ్ ఇప్పటికి రీ స్టార్ట్ చేశారు. ఇంకొంత భాగం మాత్రమే బ్యాలన్స్ ఉండటంతో త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రానా అభిమానులు విరాట పర్వం మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కృష్ణవంశీ సిందూరం తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అందులోనూ ఈ ఉద్యమం జరిగే కాలంలోనే విరాట పర్వం కథ సాగుతుంది కాబట్టి అప్పుడు జరిగిన పరిణామాలు ఇందులో సీరియస్ గా చూపించబోతున్నారు.వెంకటేష్ నారప్ప రిలీజయ్యాక దీని విడుదల విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు నిర్మాత సురేష్ బాబు. నారప్ప కనక మార్చ్ లేదా ఏప్రిల్ లో వస్తే విరాటపర్వం ఇంకొంత ఆలస్యం కావొచ్చు. ఏదైతేనేం తక్కువ గ్యాప్ లో బాబాయ్ అబ్బాయి సినిమాలు చూడబోతున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్.