Idream media
Idream media
అసలు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆశ్రమాలలో ఏం జరుగుతుంది.? అక్కడ పిల్లలను ఎందుకు బంధిస్తున్నారు.? వాళ్లతో ఏం చేయిస్తున్నారు.. తమ పిల్లలను అహ్మదాబాద్ ఆశ్రమంలో నిర్భంధించారని కనీసం చూపించట్లేదని తమిళనాడుకు చెందిన తల్లిదండ్రులు కోర్టులో కేసు వేస్తే అసలు విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పోలీసుల సహాయంతో ఆశ్రమం నుండి బయటకు వచ్చిన పిల్లల ఫిర్యాదు మేరకు నిత్యానందపై కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిత్యానంద ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ స్వదేశంలో స్వామి లేడని విదేశాలలో తల దాచుకున్నాడనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.అయితే మరికొంత మంది పేరేంట్స్ కూడా గుజరాత్ కోర్టును ఆశ్రయించారు. తమ పిల్లలు కన్పించట్లేదని హెపియస్ కార్పస్ పిటిషన్ వేశారు. బెంగుళూరు నుండి పిల్లలను అహ్మదాబాద్ ఆశ్రమానికి తీసుకువచ్చారని, పిల్లలు ఎక్కడున్నారో తెలియట్లేదని వారు కోర్టుకు తెలిపారు. మిస్సయిన పిల్లలను డిసెంబర్ 10లోగా కోర్టులో హాజరుపర్చాలని గుజరాత్ పోలీసుల్ని కోర్టు ఆదేశించింది..
ఎప్పుడైతే నిత్యానంద విదేశాలకు పారిపోయాడని వార్తలు వెలువడ్డాయో, ఒక్కొక్కరుగా నిత్యానంద బాధితులు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను తెలియజేస్తున్నారు. నిత్యానంద బెంగుళూర్ లోని ఆశ్రమంలో తన కూతుర్ని వేధింపులకు గురిచేసి 2014లో హత్య చేశారని, ఝాన్సీరాణి అనే మహిళ ఆరోపిస్తున్నారు. తన కూతురు సంగీత బెంగుళూర్ లోని నిత్యానంత ఆశ్రమంలో 2008 నుండి 2014వరకు కంప్యూటర్ విభాగానికి హెడ్ గా పనిచేశారని, ఈ సంధర్బంలోనే తనని అక్రమంగా బంధించి, హత్యచేశారని ఝాన్సీ ఆరోపించింది. ఆశ్రమంలో ఉన్న పరిస్థితులను చూసి తన కూతురు సంగీతను ఇంటికి తీసుకొచ్చానని, అయితే ఆశ్రమ నిర్వాహకులు మాఇంటికి వచ్చి నాపై కేసు పెడతానని బెదిరించి తన కూతురును తిరిగి తీసుకెళ్లారని ఝాన్సీ తెలిపింది. తర్వాత తన కూతురును ఎప్పుడు కలవలేదని చనిపోయాకే చూశానని ఆవేదన చెందింది. గుండెపోటుతో సంగీత చనిపోయినట్టు ఆశ్రమ వర్గాలు ప్రకటించాయని, తన కూతురును ఆశ్రమంలోనే దహనం చేయటానికి ప్రయత్నిస్తే తాము ప్రతిఘటించామని ఝాన్సీ ఒక మీడియా సంస్థకు తెలిపింది. సంగీత శరీరం పై గాయాలను చూసి బెంగుళూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, తర్వాత పోస్ట్ మార్టం చేయిస్తే కొన్ని అవయవాలు లేవని తేలిందన్నారు. కోర్టులో కేసు వేస్తే గతేడాది సీబిఐకి అప్పగిస్తున్నట్టు కోర్టులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి పదిరోజుల్లోనే బదిలీ అయ్యారని, కేసులో ఎలాంటి పురోగతి లేదని ఇప్పటికైనా తన కూతురు మరణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు..
నిత్యానంద విషయంలో ఒక్కోక్క ఆరోపణ నిజం అవుతున్న నేపథ్యంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఆశ్రమంలోని విద్యార్థులను బెంగుళూర్ నుండి అహ్మదాబాద్ కు ఎందుకు తీసుకువస్తున్నారు. బెంగుళూర్ ఆశ్రమంలో ఏం జరుగుతుంది. నిజంగానే 2014లో చనిపోయిన సంగీత శరీరంలో అవయవాలు ఎలా మిస్సయ్యాయి. ఈ విషయాల పై పోలీసులు సమగ్ర విచారణ జరిపితే ఆశ్రమగుట్టు తెలిసే అవకాశం ఉంది. దీనిపై లోతైన విచారణ జరిగితే ఎలాంటి ఘోరాలు వినాల్సివస్తుందోననే భయం కూడా కలుగుతుంది.