iDreamPost
android-app
ios-app

కై(వి)లాస దీవిలో నిత్యానంద

కై(వి)లాస దీవిలో నిత్యానంద

ఆయన పేరు చెబితే ప్రకృతి గడ గడా వణుకుతుంది. సాక్షాత్తు సూర్యుడే ఆయన్ని ఫాలో అవుతాడు. ఆయన మాట విని సూర్యుడు 40 నిమిషాలు మేఘాల్లో దాక్కుంటాడు. సంస్కృతం భాషని మాట్లాడే వోకల్ కార్డ్ ని జంతువుల కోసం సైన్స్ సహాయంతో తయారు చేయగలడు. తన దగ్గర సంస్కృతం తమిళం మాట్లాడే ఎద్దులు, ఆవులు, సింహాలు,కోతులు ఉంటాయి. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సూత్రం తప్పని ఆయన ఒక్కడికే తెలుసు. వేరే గ్రహాల్లో జీవం ఉందని కుండబద్దలు కొట్టి మరీ చెప్పగలడు. ఆశ్రమంలో ఎందరో ఆడవారికి ఆశ్రయం ఇస్తున్నాడు.. ఇదంతా తనలోని ఒక పార్శ్వం మాత్రమే.

ఇంకోవైపు తొంగిచూస్తే సినీ నటులతో రాసలీలలు, ఆశ్రమంలో స్త్రీలపై లైంగిక వేధింపులు, మైనర్ బాలికలపై వేధింపులు,తీర్ధంలో గంజాయి పంపిణీ చేయడం,ఆశ్రమ స్త్రీల అనుమానాస్పద మరణాలు, భూకబ్జాలు, ఆధ్యాత్మిక ముసుగులో రతి పాఠాలు నేర్పడం,ఆధ్యాత్మిక ముసుగులో చీకటి వ్యాపారాలు చేయడం,గంజాయి, మత్తు పదార్థాలు తన ఆశ్రమాల్లో వాడుతూ ఉండటం, ఆశ్రమాల్లో అవయవాల వ్యాపారం చేస్తున్నట్లుగా పుకార్లు రావడం తనలో ఉన్న మరో కోణం.. ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుంది.. అతనే వినోదాల విలాసల, వివాదాల స్వామి అని… అవును అతనే నిత్యానంద స్వామి..

Read Also: బాబు ప్ర‌తిప‌క్ష హోదాకి ముప్పు త‌ప్ప‌దా..!

గత కొన్ని రోజులుగా నిత్యానంద ఇండియాలో కనిపించడం లేదు. ఆయన దొంగ పాస్ పోర్ట్ తో విదేశాలకు పారిపోయాడని,కొంతకాలంగా ఊహాగానాలు మొదలయ్యాయి..ఆ ఊహాగానాలు నిజమేనని ఇప్పుడు అధికారికంగా తేలింది ..తనపై ఉన్న కేసుల్లో 40 కి పైగా వాయిదాలకు ఆయన హాజరు కాలేదు, దీనితో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే విదేశాలు చెక్కేసాడనే ఆరోపణలు కూడా నిత్యానందపై ఉన్నాయి. ఇప్పుడు నిత్యానంద ఆచూకీ తెలిసింది. ట్రినిడాడ్ లోని ఒక ప్రైవేట్ దీవిలో నిత్యానంద జాడ బయటపడింది. అక్కడ ఒక ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద స్వామి, దానికి “కైలాస” అని పేరు కూడా పెట్టుకున్నారు. ఆ దీవిని కొత్త దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని నిత్యానంద డిజైన్‌ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్‌ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి. ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ద్వీపదేశ వెబ్‌సైట్‌ తెలిపింది. తన కైలాస ద్వీపానికి ఒక ప్రత్యేక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందుత్వాన్ని ప్రచారం చేయడం వల్ల తన జీవితం భారతదేశంలో ప్రమాదంలో పడిందని,ఐక్యరాజ్య సమితికి పంపిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

 

తన దేశంలో విద్య, భోజనం, వైద్యం ఉచితంగానే లభిస్తాయని తన దేశ వెబ్సైట్లో నిత్యానంద పేర్కొన్నారు. మాది భౌగోళికపరమైన దేశం కాదు. ఒక భావనాత్మక దేశం. శాంతి, స్వేచ్ఛ, సేవాతత్పరతల దేశం. ఏ దేశ ఆధిపత్యం కింద లేని మేం ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం అని తన దేశ అధికారిక వెబ్సైట్లో నిత్యానంద తెలిపారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని,హిందుత్వాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తుందని అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. తమ దేశ పౌరసత్వం కావాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా విరాళాలు ఇవ్వాలని నిత్యానంద స్పష్టం చేయడం కొసమెరుపు.

Read Also: తిరుమల వెంకన్న అయిపోయాడు ఇప్పుడు యాదగిరి నర్సన్న వంతు… పేజీల కొద్దీ చాటభారతం….

గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉంటూ, కొత్తగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఆచూకీ తెలిసింది కాబట్టి, పోలీసులు నిత్యానందను ఇండియాకు తిరిగి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంటారో చూడాలి. ఇప్పటికే ఆశ్రమం ముసుగులో విరాళాలు సేకరించడానికి, మైనర్ బాలికలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. పోలీసులు విచారణలో అది నిజమని తేలింది కూడా. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ దానికి ఆధ్యాత్మిక ముసుగు తగిలిస్తున్న నిత్యానంద లాంటి బురిడీ బాబాల అంతానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతైనా ఉంది. భక్తి ఆధ్యాత్మికత ముసుగులో నేరాలు చేసే దొంగబాబాలు దేశంలో అధికం అయ్యారు. ప్రజల అమాయకత్వమే వారి ఆశ్రమాలకు పెట్టుబడిని, విరాళాలను అందజేస్తున్నాయి. ఇప్పటికే పట్టుబడిన అనేక దొంగ స్వామిజీలను వారి బాగోతాలు చూసిన తర్వాత కూడా ప్రజల నమ్మకాల్లో మార్పు రానప్పుడు, దొంగ స్వామిజీల ఆటలు దేశంలో మూడు పువ్వులు ముప్పై కాయలుగా సాగుతూనే ఉంటాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.