iDreamPost
android-app
ios-app

నష్ట నివారణ చర్యల్లో నితీష్ – విద్యార్ధులకి హామీ

నష్ట నివారణ చర్యల్లో నితీష్ – విద్యార్ధులకి హామీ

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో అత్యంత కీలకమైన రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రేపు రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలోని 94 నియోజకవర్గాలలో ఉన్న 2.85 కోట్ల ఓటర్లు 1463 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్,ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, జన్ అధికార పార్టీ (ఎల్ ఓ) అధినేత పప్పు యాదవ్,ప్లూరల్స్‌ పార్టీ అధినేత పుష్పం ప్రియ,మంత్రి నందకిషోర్ యాదవ్‌తో సహా పలువురు ప్రముఖులు రంగంలో ఉన్నారు.

ఇక మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ ఇచ్చిన 10 లక్షల ఉద్యోగాల కల్పన హామీ రాష్ట్రంలోని యువకులను విశేషంగా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో మొదటి దశ పోలింగ్ ముగిసిన తర్వాత నష్ట నివారణ చర్యగా ఉన్నత విద్య కోసం విద్యార్థులకు క్రెడిట్ కార్డులను అమలు చేస్తామని సీఎం నితీశ్‌కుమార్‌ హామీని ఇచ్చాడు. ఈ పథకం కింద గరిష్టంగా ఒక్కొక్క విద్యార్థికి నాలుగు లక్షల రూపాయలు అందిస్తామని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాగే తమ ప్రభుత్వం 10 లక్షల మంది యువతకు సాంకేతిక విద్యను అందించిన ‘కుశాల్ యువ పథకం’ గురించి ఆయన పదేపదే ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు.

కాగా రెండో దశ పోలింగ్ జరిగే సీమాంచల్‌ జిల్లా ప్రజలు ముఖ్యంగా వర్గ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తారు. రెండో విడత పోలింగ్‌లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్‌ (60శాతం), అరారియా (45శాతం), కతీహార్‌ (40శాతం),పూర్నియా (30శాతం) ఉండటం గమనార్హం. ఈ నాలుగు జిల్లాలలో అధికార ఎన్డీయేపై ప్రతిపక్ష మహాకూటమి పార్టీలకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది.ఇక తూర్పు, పశ్చిమ చంపారన్ జిల్లాలలో అగ్రకులాలు,వ్యాపార వర్గాలు బీజేపీ వెన్నంటి నిలుస్తున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ రెండు జిల్లాలలోని మొత్తం 21 స్థానాలలో 13 స్థానాలను బీజేపీ ఏకపక్షంగా గెలుపొందింది. అయితే సీఎం నీతీశ్‌ కుమార్ నాయకత్వంలోని జేడీయూ మాత్రం అనేక జిల్లాలలో ఏటికి ఎదురీదుతున్నట్లు ఆర్జేడీ నుంచి మున్నెన్నడూ లేనంత గట్టిపోటీని ఎదుర్కొంటుంది.

ఎన్డీయేది డబుల్ ఇంజిన్ కాదు..ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వం

జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ట్విటర్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కి కంచుకోట లాంటి ఛప్రా నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ఎన్డీయే కూటమికి చెందిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రకటించారు. కానీ ఆ డబుల్‌ యువరాజుల ఏకైక లక్ష్యం మాత్రం తమ సింహాసనాలను రక్షించుకోవడంపైనే దృష్టి అని ప్రధాని మోడీ ఆరోపించారు.కాగా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన లాలూ “అది డబుల్ ఇంజిన్ కాదు..ట్రబుల్ ఇంజిన్‌ ప్రభుత్వం.లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చేందుకు ఈ డబుల్‌ ఇంజిన్‌ ఎక్కడకు పోయింది?” అంటూ ప్రశ్నించారు. 

సోషల్ మీడియాలో భారీ ఎత్తున మోడీ వ్యతిరేక ప్రచారం

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో #BiharRejectsModi అనే హ్యాష్‌ట్యాగ్‌తో జోరుగా ప్రచారం సాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లు, వందలాది కార్లు వినియోగించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవే వాహనాలను లాక్‌డౌన్‌లో అధికార ఎన్డీయే ప్రభుత్వం వినియోగించి ఉంటే వందలాది బీహారీ వలస కార్మికుల ప్రాణాలను కాపాడగలిగేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తన గడ్డం పెంచడంపై పెట్టిన శ్రద్ధ బిహారీలపై పెట్టి ఉంటే లక్షలాది వలస కార్మికుల సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించేవారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహారీలు ప్రధాని మోడీని నమ్మడం లేదని ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తాయని వేలాది మంది ట్వీట్లు చేస్తున్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో బీహారీ యువత ప్రధాని మోడీ వ్యతిరేక ప్రచారాన్ని హోరెత్తిస్తుండటంతో అధికార కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

ఇక రెండో దశ పోలింగ్ ఫలితాలే అధికార పీఠాన్ని నిర్దేశిస్తాయి అనే అంచనాల మధ్య అధికార, ప్రతిపక్ష కూటములకు రేపటి ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పేర్కొనవచ్చు.