iDreamPost
android-app
ios-app

చెడిన బీజేపీ-జేడీయూ బంధం.. మేము రెడీ అంటున్న ఆర్జేడీ!

చెడిన బీజేపీ-జేడీయూ బంధం.. మేము రెడీ అంటున్న ఆర్జేడీ!

బీజేపీ-జేడీయూ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం అశోకుడు, ఔరంగజేబ్‌ మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ కల్చరల్‌ సెల్‌ చీఫ్‌ దయా ప్రకాశ్‌ సిన్హా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్‌లోని జేడీయూ పరివారం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. జేడీయూపై కమలదళం ఎదురుదాడికి దిగడంతో అక్కడి జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రెండు పార్టీల మధ్య చిచ్చు రేగుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని జేడీయూ నిర్ణయించింది. అంతే కాదు సీఎం నితీష్ నేతృత్వంలోని పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పింది. యూపీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, సీఎం యోగికి వ్యతిరేకంగా తమ పార్టీ జేడీయూ తరపున ప్రచారం చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ శనివారం యూపీ ఎన్నికలకు 26 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఢిల్లీలో విడుదల చేశారు. జేడీయూ తరపున ఈ నిర్ణయం తీసుకున్న తరుణంలో జేడీయూ కోటా నుంచి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న ఆర్‌సిపి సింగ్‌కు బీజేపీతో చర్చలు జరిపే బాధ్యతను అప్పగించారు. ఈ విషయమై బీజేపీ హైకమాండ్‌తో కూడా సింగ్ చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయి.

దీంతో నుంచి ఎన్నికలకు 51 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను జేడీయూ ఖరారు చేసింది. తీవ్ర విభేదాల మధ్య, ఆర్‌సిపి సింగ్ హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జె. పి.నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ ల ముందు తమ పార్టీ ఉద్దేశాలు ఉంచినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీపై ఒంటరిగానే పోటీ చేయాలని జేడీయూ నిర్ణయించింది. పార్టీకి గౌరవప్రదమైన సీట్లు వస్తేనే జేడీయూ బీజేపీ లేదా ఇతర పార్టీలతో చేతులు కలుపుతుందని జేడీయూ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్‌ ఇంచార్జి కె. సి.త్యాగి ఇప్పటికే స్పష్టం చేశారు.

యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడాలని జేడీయూ నిర్ణయించుకోవడంతో బీహార్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన మరింత పెరుగుతోంది. నిజానికి ఎన్డీయేలో కొనసాగుతున్న విభేదాలు మరింత పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, ప్రభుత్వంలో అనేక అంశాల్లో కలిసి ఉన్నప్పటికీ జేడీయూ, బీజేపీల మధ్య అస్సలు పొసగడం లేదు.

ఈ రెండు పార్టీల మధ్య కొత్త రాజకీయవైరం కాదు. 2015లో ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ ,ఆర్‌జెడితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ముజఫర్‌పూర్‌లో జరిగిన పరివర్తన్ ర్యాలీలో నితీష్ కుమార్‌పై మోడీ విరుచుకుపడ్డారు, నితీష్ కుమార్ డిఎన్‌ఎలో కొంత సమస్య ఉంది అంటూ ఘాటు కామెంట్లు చేశారు. తరువాత 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, జేడీయూ కేవలం 43 సీట్లు వచ్చినప్పుడు, బీజేపీ నాయకులు జేడీయూ సహా నితీష్ కుమార్‌ పై చాలాసార్లు పరోక్షంగా దాడి చేశారు. దానికి తోడు అరుణాచల్‌లోని జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీలో చేర్చుకోవడంతో దూరం పెరిగింది. ఇప్పుడు మరోసారి యూపీ ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

అశోకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీతో కలిసి పోటీచేస్తే కుర్మీలు, కుష్వాహు వర్గాల నుంచి తలనొప్పులు రావొచ్చన్న ఉద్దేశంతోనే జేడీయూ పార్టీ ఈ పొత్తులు లేని పోటీ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. బీహార్‌లో ఒకవేళ బీజేపీ మద్దతును ఉపసంహరించుకొంటే, నితీశ్‌కు తాము మద్దతు ఇస్తామని ఆర్జేడీ ఇప్పటికే పరోక్ష సంకేతాలు పంపింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.