నరేంద్ర మోడి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంలో సాధించిన విజయాలు గురించి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలులో ఉన్న విధ్యుత్ చార్జీలపై కొన్ని వాఖ్యలు చేశారు. కేంద్రం యూనిట్ విద్యుత్ రూ.2.70కే ఇస్తుందని, కానీ ఏపీలో యూనిట్‌కు రూ.9 ఛార్జ్ చేస్తున్నారని, యూనిట్‌కు రూ.9 చెల్లించి ప్రజలు ఎలా బ్రతుకుతారు? అంటూ ప్రశ్నించారు. దేశానికి ఆర్ధిక మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో అమలులో ఉన్న విద్యుత్ చార్జీలపై నిర్మలాసీతారామన్ అర్ధసత్యాలతో కూడిన ఆరోపణలు చేస్తారని ఎవ్వరూ ఉహించలేదు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.యస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటివరకు సామాన్యులపై విద్యుత్ చార్జీల భారం మోపిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ చార్జీలు ఒకసారి పరిశీలిస్తే దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలే అతితక్కువ ధరకు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయనేది కాదనలేని సత్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేసిక్ స్లాబ్ కు ఉన్న రేటు చూస్తే 0-50 యూనిట్ల వరకు 1.45 రూపాయలు ఉండగా గుజరాత్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రంలో 2.65రూ గా ఉంది. అదే పేదవారు ఎక్కువ గా వినియోగించే 51-100 యూనిట్లకు చూస్తే రూ 2.60 ఉండగా గుజరాత్ లాంటి రాష్ట్రంలో రూ 3.10గా ఉంది. ఇక గుజరాత్ రాష్ట్రంలో 250 యూనిట్ల పైన విద్యుత్ వినియోగదారులకు రూ 8.60గా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 500 యూనిట్ల పైన వినియోగించే వినియోగదారులకు రూ 9.95గా ఉంది.
ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చే సరికి 500 యూనిట్లను వినియోగించే సంపన్నలుకు మాత్రం యూనిట్ ధర 9.50 రూపాయల నుండి 90 పైసలు పెంచుతూ 9.95 చేశారు. దీనివలన సామాన్యులకు ఒక్కపైసా కూడా భారం పడదు,500 యూనిట్లు వాడే స్థాయిలో విద్యుత ఉపకారణాలు పేద,మధ్య తరగతి వారి ఇండ్లలో ఉండవు. దీంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందస్తు వ్యూహంతో చౌక విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల రూ.700 కోట్లు మిగిల్చడమే కాకుండా, గడచిన ఏడాదిలోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ.4,783.23 కోట్లు ఆదా చేసాయి.
నిజాలు ఇలా ఉంటే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉనట్టుండి రాష్ట్ర ప్రభుత్వం పై విద్యుత్ చార్జీల నెపం చూపి అర్ధసత్యాలతో కూడిన ఆరోపణలు చేయడం చూస్తే దీని వెనుక కేంద్రం రచించిన భారీ ప్రణాళిక ఉందనే మాట వినిపిస్తుంది. నరేంద్రమోడి అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుని తమ గుపెట్లో పెట్టుకోవాలనే చూస్తుంది అనేది కాదనలేని సత్యం. ఈ ఒరవడిలోనే తాజాగా 2003 విద్యుత్ చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదనలు చేస్తూ 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. నేడు ఆర్ధిక మంత్రి చేస్తున్న ఈ ఆరోపణలు వెనక ఉన్న అసలు లక్ష్యం చూస్తే రాష్ట్రాలపై ఏదో ఒక నేపం మోపి విద్యుత్ సంస్థలను పూర్తిగా తమ గుపెట్లోకి తెచ్చుకునే ప్రయత్నమనే చెప్పాలి
ప్రధాని నరేంద్రమోడి 6 ఏళ్ల పాలనలో ఇప్పటికే 23 సంస్థలకు ప్రైవేట్ పరం చేశారు. ఇందులో దేశంలో బొగ్గు గనుల దగ్గర నుండి ఎల్.ఐ.సి, రైల్వే వరకు అనేక సంస్థలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ జాబితాలోకి విద్యుత్ సంస్థను కూడా చేర్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ (సవరణ) చట్టం 2020 బిల్లుతో ప్రజల నడ్డి విరిచే కార్యక్రమానికి కేంద్రం పూనుకుంది . ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం చూస్తే సబ్సిడీలు ఎత్తివేసి వినియోగదారులపై భారాలు మోపడం, డిస్కంలను నిర్వీర్యం చేస్తూ విద్యుత్ పంపిణీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, గృహ వినియోగదారులకు ఇప్పటిలా సబ్సిడి తరవువాత బిల్లు చెల్లించే పద్దతిలా కాకుండా , గ్యాస్ సబ్సిడీలా యూనిట్ ధర ముందుగా చెల్లించి ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం ఎదురు చూసే చర్యలకు పూనుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం.
ఈ సబ్సిడీ ఎత్తివేత వల్ల వ్యవసాయ రంగం కుదేలౌవుతుంది. పేద, మధ్యతరగతి రైతులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్ అందుకుంటున్న రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించి చార్జీలు వసూలు చేసే అవకాశమూ లేకపోలేదనే చెప్పాలి దీంతో రైతులు నెలకు రూ.3వేల నుంచి రూ.4వేల మేర బిల్లుతో పాటు ఒక్కో కొత్త మీటర్ కనెక్షన్ కు సుమారు 2 వేల వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలాగే ఉద్యోగులకు భద్రత కరువౌతుంది. కేంద్రప్రభుత్వం తీస్కుంటున్న ఈ చర్యల వలన రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తమ హక్కులను కోల్పొవడమే కాకుండా విద్యుత్ వలన తమ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూస్తూ ఉండటమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది.
డిస్కంలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం , ప్రజల సబ్సిడీలపై కోతలు పెట్టే ఇలాంటి బిల్లులుతో పేద ప్రజల నడ్డి విరిచి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి విద్యుత్ సంస్థలను చట్టం రూపంలో బలప్రయోగం చేసి లాక్కుని ప్రైవేటు వ్యక్తులకు దారాదద్దతం చెసే ఆలొచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలో భాగంగా తోలుత రాష్ట్రాలపై విద్యుత్ చార్జీల నెపం నెట్టి ఆ తరువాత ప్రజలకు దానినే బూచిగా చూపి రాష్ట్ర హక్కులని తన చేతిల్లోకి తీసుకునే ఆలొచనలో కేంద్ర ప్రభుత్వం అల్లుతున్న ఈ ఉచ్చులో రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు పడకుండా ఎలా తప్పించుకుంటాయో వేచి చూడాలి.