విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటన గుర్తుందా..?? నిశి రాత్రి వేళ రాకాసి పవనాలు ఊరి మీద పడి ఏకంగా 12 మందిని పొట్టన పెట్టుకున్నాయి. విశాఖపట్నం నగరం మొత్తం ఉలిక్కి పడిన సంఘటన ఇది. తర్వాత కొద్ది రోజుల పాటు భయం భయంతోనే ఇక్కడి ప్రజలు బతుకు వెళ్లదిసారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత సాగిన సహాయక కార్యక్రమాలను, ప్రభుత్వం బాధితుల పట్ల వ్యవహరించిన తీరును తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రశంసించడం తో పాటు ప్రభుత్వ తీరు మరిన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడింది.
సుమోటో గా స్వికరించి!
2020 మే 7 వ తేదీన ఎల్జి పాలిమర్ ఫ్యాక్టరీ నుంచి అర్ధరాత్రి లీకైన విషవాయువులు లీకై 12 మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన భోపాల్ దుర్ఘటన లో గుర్తు చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఘటన ఎలా జరిగింది అన్నది? దాని తర్వాత ప్రభుత్వ స్పందన? బాధితుల గోడును పూర్తిస్థాయిలో విచారించింది. సుమారు 80 రోజుల పాటు ఈ దర్యాప్తును ముగ్గురు సభ్యులు చాలా సీరియస్గా దృష్టి సారించి చేశారు. పరిశ్రమను పూర్తిగా పరిశీలించడమే కాకుండా అధికారులతో మాట్లాడి స్వయంగా బాధితులను కలిసి అప్పటి పరిస్థితుల పై ఓ అంచనాకు వచ్చారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం దీనిపై సవివర నివేదిక ను జాతీయ మానవ హక్కుల కమిషన్ తయారుచేసింది.
ప్రభుత్వం చర్యలు భేష్
మానవ హక్కుల కమిషన్ నివేదికలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంఘటన జరిగిన తర్వాత స్పందించిన తీరు మీద విచారణ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. బాధితులకు అండగా ఉండడం లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుంది అని ప్రశంసించారు. బాధితుల్ని అడ్డుకోవడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చిందని ఎన్ హెచ్ ఆర్ సీ తెలిపింది. బాధితులకు వెంటనే పరిహారం అందించడంతో పాటు ఘటనకు కారణంగా భావించిన సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వ స్పందన బాగుందని, కార్యాచరణ నివేదికలను సైతం అంగీకరిస్తున్నట్లు మానవ హక్కుల కమిషన్ తెలిపింది. ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల పరిహారం ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి లక్ష రూపాయల నష్టపరిహారాన్ని వెనువెంటనే అందించడంలో చొరవ పోవడం వల్ల బాధితులకు ఎంతో ఊరట నిలిచిందని నివేదికలో పేర్కొనడం విశేషం.
సురక్షిత ప్రాంతాలకు తరలించి..
ప్రమాద ఘటన అనంతరం ప్రభుత్వం తీసుకున్న యుద్ధప్రాతిపదికన చర్యలు గురించి నివేదికలో ప్రస్తావించారు. ఆర్అర్వి పురం, నందమూరి నగర్, కంచరపాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బిసి కాలనీ, మేఘాద్రి పేటలో సుమారు 15 వేల మందినీ వెనువెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడం బాగుందని కొనియాడింది. ఇక ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ 150 కోట్లు వెంటనే డిపాజిట్ చేశామని ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు చెప్పడం మీద సంతోషం వ్యక్తం చేసారు. ఈ ఘటనలో 437 మందిని విచారించి 12 మంది మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా సంస్థ సీఈఓ డైరెక్టర్లు సీనియర్ అధికారుల పాస్పోర్ట్ లను సైతం వెంటనే సీజ్ చేసిన ప్రభుత్వ తీరు ను మెచ్చుకుంది. అయితే ఈ ఘటనలో మరి కొన్ని నివేదికలు పెండింగ్లో ఉన్నాయని అవన్నీ కూడా వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయి చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్పింది. మొత్తం మీద ఎల్జి పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వ వేగవంతమైన స్పందన మరికొన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం అంటూ చెప్పడం విశేషం.