iDreamPost
android-app
ios-app

రాబోయే 6 నెలల్లో ఎన్నో సవాళ్ళు

  • Published Jun 08, 2020 | 5:25 AM Updated Updated Jun 08, 2020 | 5:25 AM
రాబోయే 6  నెలల్లో ఎన్నో సవాళ్ళు

లాక్ డౌన్ వల్ల గత 80 రోజులుగా స్థంభించిపోయిన సినిమా పరిశ్రమ మరికొద్ది రోజుల్లో పునఃప్రారంభం కాబోతోంది. షూటింగులు మొదలుపెట్టుకోవడానికి ఇంకా పక్కా అనుమతులు రానప్పటికీ రేపో ఎల్లుండో అనేలా ఉంది పరిస్థితి. ప్రస్తుతానికి ఏదో తెలియని మౌనం రాజ్యమేలుతోంది. సరే ఈ జూన్ ని వదిలేసినా వచ్చే నెల జూలై నుంచి రూట్ క్లియర్ కావడం ఖాయం. ఇప్పటికే నిర్మాతలు గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఏర్పాట్లు, కొత్త బడ్జెట్లు ప్లాన్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఆరు నెలలు అందరికి పెను సవాళ్లు విసరబోతున్నాయి. ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. జనం ఎప్పటిలాగే రోడ్ల మీద తిరుగుతున్నా థియేటర్లకు కూడా ముందు లాగా వస్తారా అన్న సందేహం మాత్రం ఎవరూ తీర్చడం లేదు.

ఏ షూటింగ్ స్పాట్ లో ఒక్క కేసు బయటపడినా హీరో హీరోయిన్లు ఇతర యాక్టర్లు భయపడి మేమిక రామని చెప్పే అవకాశం ఉంది. అందులోనూ స్పాట్ అంటేనే ఎక్కడెక్కడి నుంచో వచ్చే జనాల సమూహం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పూర్తిగా కట్టడి చేయడం అంత సులభం కాకపోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు 2021 సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నాయి. చిరంజీవి ఆచార్య, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, ప్రభాస్ 21, వెంకటేష్ నారప్ప తదితరాలు రేస్ లో ఉన్నాయి. ఇప్పుడీ ఆరు నెలలు ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్నీ సవ్యంగా జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. లేదూ కేసుల సంఖ్య ఇలాగే ఉందంటే మాత్రం మళ్లీ చిక్కులు తప్పవు.అందుకే సీనియర్ హీరోలు ఈ విషయంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్లు కూడా కోత వేసి ఫారిన్ షెడ్యూల్స్, స్టూడియో సెట్టింగ్స్ లాంటి వాటికి స్వస్తి చెప్పి సాధ్యమైనంత మేర నిర్మాత మీద బరువు తగ్గేలా చూస్తున్నారట.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ వచ్చేదాకా నో షూటింగ్స్ అని కొందరు హీరోలు అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మాములుగానే అతి జాగ్రత్తగా ఉండే హీరోయిన్ల గురించి చెప్పేదేముంది. కొందరు ఏకంగా సైన్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా వదులుకుంటున్నారట. అందుకే ఖాళీ సమయం దొరికినా కూడా క్యాస్టింగ్ అనేది స్టార్ట్ కావాల్సిన సినిమాల దర్శకులకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఇవి పైకి కనిపిస్తున్న సమస్యలు మాత్రమే. అంతర్గతంగా బయటపడనివి ఇంకా చాలా ఉన్నాయి. మొదలుపెట్టడం ఈజీనే కానీ కొనసాగించడం పర్మిషన్ తెచ్చుకున్నంత ఈజీ కాదని విశ్లేషకుల అభిప్రాయం. పైగా షూటింగ్ జరిగే క్రమంలో ఏ కేసు బయటపడినా దానికి బాధ్యత నిర్మాతే వహించాల్సి ఉంటుంది కాబట్టి జరుగుతున్నన్నాళ్లు వ్యవహారం అంత తేలిగ్గా ఉండదు. ఇన్ని చిక్కుముడులు ఉన్నాయి కనకే ఎవరూ తొందపడి ఎలాంటి అప్ డేట్స్ కానీ స్టేట్ మెంట్స్ కానీ ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఫలానా సినిమా షూటింగ్ ఫలానా టైంలో అయిపోతుందని కానీ లేదా రిలీజ్ అవుతుందని కానీ ఎవరూ చెప్పలేరు. దాన్ని కాలానికి వదిలేసి ఎవరి పని వాళ్ళు చూసుకోవడమే ఇండస్ట్రీలో ఎవరైనా చేయగలిగింది.