Idream media
Idream media
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు కంప్యూటర్ పై అవగాహన లేని రోజుల్లో కంప్యూటర్ ఆపరేటర్ గా చేరి… అంచలంచెలుగా తహసీల్దార్ స్థాయికి ఎదిగి… కోట్లకు పడగలెత్తిన కీసర తహసీల్దార్ నాగరాజు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. నాటి నుంచి ఆయన కూడబెట్టిన అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ వెలికి తీస్తున్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాగరాజుతోపాటు వీఆర్‌ఏసాయిరాజ్, సత్య డెవలపర్స్ ప్రతినిధి శ్రీనాథ్, రియల్‌ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డిని కస్ట డీలోకి తీసుకుని విచారిస్తోంది. ఈ విచారణలో రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరికి, వారికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీకి సంబంధం ఏంటి..?
రియలర్ట్ అంజిరెడ్డి, నాగరాజు మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీనిలో భాగంగా కీసర మండలం రాంపల్లిదయారాలోని అంజిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. రెండు రోజుల క్రితం డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు టీమ్ జరిపిన సోదాల్లో కీలకమైన 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు ఓ పార్టీ ఎంపీకి, అంజిరెడ్డికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్, వరంగల్ లో నాగరాజుకు సంబంధించి న ఆస్తుల డాక్యుమెంట్లను సేకరించినట్లు తెలిసింది. అల్వాల్‌లోని నాగరాజు ఇల్లు, కారులో స్వాధీనం చేసుకున్న రూ.36 లక్షల వివరాలను రాబడుతోంది. ఈ కేసుకు సంబంధించి ఉప్పల్ లోని మరో రియల్టర్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరిపినట్లు తెలిసింది. కోటీ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నాగరాజు అక్రమాలపై ఫిర్యాదులు చేసేందుకు బాధితులుఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు.
గతంలోనూ భూ కబ్జా కేసులు
రియల్టర్ అంజిరెడ్డితో సంబంధం ఉన్న కాంగ్రెస్ ఎంపీపై గతంలోనూ ఎన్నో భూ కబ్జా కేసులున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా బయటపడిన ఘటనలోనూ ఆయనకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నాగరాజుకు లంచాలు సమర్పించి ఎక్కడైనా భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారా..? అనే వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.