iDreamPost
iDreamPost
దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దేశ ప్రజలందరినీ ఆకర్షించే రీతిలో మారుతుంది. భూసంస్కరణలు అనగానే పశ్చిమ బెంగాల్ గుర్తుకొస్తుంది. పారిశ్రామిక ప్రగతికి గుజరాత్ నిదర్శనంగా నిలుస్తోంది. నగరీకరణ విషయంలో మహారాష్ట్ర ఆదర్శం అవుతుంది. విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ చర్యలు ఆకట్టుకుంటాయి. గ్రామీణ పాలన, పర్యాటకం వంటి విషయాల్లో కేరళ ముందు పీఠిన నిలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి కూడా ఆయా రాష్ట్రాలతో పోల్చదగిన వనరులున్నప్పటికీ చంద్రబాబు సర్కారు చేసిన అశ్రద్ధ మూలంగా తగిన గుర్తింపు రాలేదనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా విధానాల పరంగా యూటర్న్ తీసుకునే ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల పార్లమెంట్ సాక్షిగానే పలువురు విమర్శలు గుప్పించిన విషయం ఏపీ పరిస్థితికి అద్దంపడుతుంది.
గతమెంతో ఘనకీర్తి కలవాడా అన్నట్టుగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఎన్నో అపకీర్తులను ఆంధ్రప్రదేశ్ చవిచూడాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఖాళీ ఖజానాతో పీఠం ఎక్కిన జగన్ సంకల్పం సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది ఇప్పుడు దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలువురు నేతలు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను ప్రశంసించే పరిస్థితి వచ్చింది. వివిధ రాష్ట్రాల ప్రతినిధి బృందాలు ఏపీలో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఆశ్చర్యం వ్యక్తం చేసే స్థితి వస్తోంది. ముఖ్యంగా గ్రామీణ పరిపాలనా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. పల్లె ప్రగతిని పట్టాలెక్కించబోతున్నాయి. రూపురేఖలు మారుతున్న గ్రామీణ ఆంధ్ర ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే దిశలో సాగుతున్నాయి.
గతంలో పల్లెల్లో ఒక్క ప్రభుత్వ కార్యాలయం ఉంటే అదో గొప్ప.దానిలో సిబ్బంది జాడే ఉండేది కాదు. మూడు నాలుగు పంచాయితీలకు ఒక్కరే అధికారిగా ఉండేవారు. ఎవరు ఎప్పుడు వస్తారో తెలిసే దాఖలాలు లేవు. దాంతో ప్రతీ పల్లె నుంచి ఏ చిన్న పని వచ్చినా మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి తరలిరావాల్సిన అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం దానికి పూర్తి భిన్నం. అసలు సమస్య వస్తుందని తెలియగానే బాధితుల కన్నా ముందు సచివాలయ సిబ్బంది అక్కడ ఉంటున్నారు. ప్రతీ పంచాయితీ పరిధిలో కాదు..2వేల జనాభాకి ఒక కార్యాలయం. అందులో నిత్యం కళకళలాడేలా 10 మంది సిబ్బంది మరో 20 మందికి పైగా వాలంటీర్లు కనిపిస్తున్నారు. దాంతో పల్లెల్లో పాలన పూర్తిగా మారిపోయింది. అంతేగాకుండా రైతు భరోసా కేంద్రాలు మరో వ్యవసాయ విప్లవానికి సంకేతికతను జోడించే దిశలో సాగుతున్నాయి. అన్నింటికీ మించి పల్లె క్లినిక్కుల నిర్మాణం వేగంగా సాగుతోంది. ప్రతీ గ్రామంలోనూ వైద్య సేవలు అందుబాటులో రాబోతున్నాయి. ఎప్పుడు వస్తుందో తెలియని 104 సంచార వైద్య శాల స్థానంలో స్థిరమైన భవనంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా మార్పులు చేస్తున్నారు.
ఒక్క ప్రభుత్వ భవనం కూడా కనిపించని మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతీ ఊరికి కనీసం 5 ప్రభుత్వ భవనాల ఏర్పాటు జరుగుతోంది. ఇప్పటికే కొన్ని తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్నాయి. అనేక చోట్ల శాశ్వత నిర్మాణ పనులు సాగుతున్నాయి. అవన్నీ అందుబాటులోకి వస్తే పల్లె పాలన అసాధారణ రీతిలో మారిపోతుందనడంలో సందేహం లేదు. ఇదో విప్లవాత్మక మార్పుగా పలువురు పరిగణిస్తున్నారు. రెండేళ్లలోనే వాటి ఫలితాలు అందుకుంటున్న గ్రామీణ జనం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రణాళికల ప్రకారం ప్రతీ కార్యాలయం సిద్ధమయితే గ్రామాలకు పూర్తి భరోసా వస్తుందనే ఆనందం వ్యక్తమవుతోంది. విలేజ్ క్లినిక్ తో వైద్యం. నాడు నేడుతో విద్య , రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయం, సచివాలయ ఏర్పాటుతో సమస్త అభివృద్ధికి బాటలు వేయడం చూస్తుంటే గ్రామీణ స్వరాజ్యం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి జరగడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలకు పల్లెల్లో ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడులతో జరగబోతున్న అభివృద్ధి మార్గం పొంతన లేదనే చెప్పాలి. అందరికీ ఇళ్లు అందిస్తూ, పాలనను వారి ఇంటి దరికి చేరుస్తున్న సమయంలో రాబోయే రోజుల్లో ఏపీ పాలనా పద్ధతులో ఓ రోల్ మోడల్ గా మారే అవకాశం కనిపిస్తోంది.