iDreamPost
android-app
ios-app

జిల్లాల విభజన : కొత్త జెడ్పీ చైర్మన్లు వస్తారా?

జిల్లాల విభజన : కొత్త జెడ్పీ చైర్మన్లు వస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాలు ఇక నుంచి 26 జిల్లాలు కానున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తూ తాజా నోటిఫికేషన్ జారీ అయింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల పాలన ప్రారంభించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, ఇప్పుడు జిల్లాల స్వరూపాల్లో సమూల మార్పులు చేర్పులు జరగనున్న నేపథ్యంలో 13 జిల్లా పరిషత్ ల గురించి చర్చ మొదలైంది. కొత్త జిల్లా పరిషత్ లు ఏర్పడతాయా? లేదా? ఏర్పడితే ఎప్పుడు ఏర్పడతాయి అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది.

చట్టం ఏం చెబుతోంది?

చట్ట ప్రకారం జిల్లాల విభజనకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినప్పటికీ, అది జిల్లా ప్రజా పరిషత్‌లపై ఇప్పటికిప్పుడు అయితే ప్రభావం చూపే అవకాశం లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రజా పరిషత్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగ్గా, అక్టోబర్‌లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాల విభజన కార్యరూపం దాల్చినప్పటికీ, జెడ్‌పి చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల సహా అన్ని పాలకవర్గాలు వాటి పూర్తి పదవీ కాలం అంటే ఐదేళ్ల పాటు కొనసాగనున్నాయి. పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత జిల్లాలు లేదా మండలాల విభజన జరిగితే, ఆయా జిల్లాల్లో పాత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలకు పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ విషయంలో ఏం జరిగింది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే అంటే విభజనకు ముందే తెలంగాణ పరిధిలోని తొమ్మిది జిల్లా పరిషత్‌ లకు 2013లో పాలక వర్గాలు ఏర్పడ్డాయి. తెలంగాణ మేమే తెచ్చామని కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తే అన్నిటికీ సౌలభ్యంగా ఉంటుందనే హామీతోనే ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో 31 జిల్లాలకు ప్రాథమికంగా నోటిఫికేషన్‌ ఇచ్చి ఆ ఏడాది అక్టోబర్‌ నుంచి ఆ జిల్లాల్లో పరిపాలన ప్రారంభించింది. 31 జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, తొమ్మిది జిల్లా పరిషత్‌లనే వాటి పదవీ కాలం అయ్యేదాకా కొనసాగించారు. వాటి పదవీకాలం పూర్తయిన తర్వాత, కొత్త జిల్లాల వారీగా జెడ్‌పిటిసి, ఎంపిటిసిలకు ఎన్నికలను నిర్వహించారు.

కేంద్రం గుర్తింపు అవసరమే?

జిల్లాల విభజన పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. కానీ జిల్లా పాలనా యంత్రాగాన్ని అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మాత్రం కేంద్ర ప్రభుత్వమే అలాట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఏపీ విషయానికి వస్తే ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో కొరత ఉంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు జరిగితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పూర్తి స్థాయి కేటాయింపు వరకు రెండు జిల్లాలకు ఒక కలెక్టర్, ఎస్పీ అధికారులుగా వ్యవహరించే అవకాశం ఉంది.

అలాగే కేంద్రం జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. అంతేకాక కోవిడ్ కారణంగా 2020 జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. ఆ జనాభా లెక్కలు ముగిసేవరకు జిల్లాల విభజన కేంద్రం దృష్టిలో పూర్తవదు. కానీ ఏపీ ప్రభుత్వం ముసాయిదా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎలా చూసుకున్నా ఇప్పటికిప్పుడు అయితే జిల్లా పరిషత్ ల విషయంలో ఎలాంటి మార్పులు జరగవనేది సుస్పష్టం. గత ఏడాది ఏర్పాటైన పాలకవర్గాలు పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నాయి.