iDreamPost
iDreamPost
ఆ మధ్య వినయవిధేయ రామలో హీరోయిజంని, మాస్ పేరుతో యాక్షన్ ఎపిసోడ్స్ ని అతిగా చూపించారని అందరూ బోయపాటి శీనుని ఆడిపోసుకున్నారు కానీ ఆయనను మించిన బాద్షాలు బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నారని మరోసారి రుజువయ్యింది. మోస్ట్ సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ చాలా గ్యాప్ తీసుకుని ఆయన కొడుకు వరుణ్ ధావన్ హీరోగా తీసిన కూలీ నెంబర్ వన్ నిన్న అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా విడుదలయ్యింది. 1995లో ఇదే డేవిడ్ తీసిన కల్ట్ కామెడీ క్లాసిక్ రీమేక్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ట్రైలర్ ని ఎంటర్ టైనింగ్ గా కట్ చేయడంతో క్రిస్మస్ రోజు వ్యూస్ బాగానే వచ్చాయి. సారా అలీ ఖాన్ హీరోయిన్ కాగా దీని కోసం బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని రీమిక్స్ కూడా చేశారు.
ఇక అసలు విషయానికి వద్దాం. ఎప్పుడో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి కథను తీసుకుని ఇప్పటి జెనరేషన్ టేస్ట్ ని పట్టించుకోకుండా తన ఓల్డ్ స్కూల్ స్టైల్ లో ప్రెజెంట్ చేద్దామని ప్రయత్నించాడు డేవిడ్ ధావన్. ప్యారడైజ్ బిర్యాని పేరుతో మగ్గిపోయిన బియ్యంతో వండిన మాడిపోయిన పులిహోర వడ్డించాడు. ఇది అర్థం కావాలంటే ఓ ఆణిముత్యం లాంటి సీన్ చెప్పుకుందాం. పట్టపగలు జనం రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ ట్రాక్ మీద చెవులు వినిపించని ఓ కుర్రాడు బొమ్మ కోసం కూర్చుంటాడు. ఈలోగా ట్రైన్ వస్తుంది. మన హీరో కూలీ గారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి అమాంతం దూకేసి ఎలెక్ట్రిక్ రన్నింగ్ ట్రైన్ టాప్ మీద కిలోమీటర్ పరిగెత్తి రెప్పపాటులో స్పైడర్ మాన్ రేంజ్ లో బాబుని కాపాడి శభాష్ అనిపించుకుంటాడు.
ఈ అద్భుత సన్నివేశాన్ని నవ్వకుండా సీరియస్ గా చూడగలిగితే మీకు ఆస్కార్ ఇవ్వొచ్చు. ఎంత హీరోయిజంని ఎలివేట్ చేసేదే అయినా మరీ ఇంత అతి అవసరమాని అనిపించకపోతే ఒట్టు. కథ గురించి చెప్పేదేమీ లేదు. సుమన్ చిన్నల్లుడుని ఓసారి రివైండ్ చేసుకోండి చాలు. వరుణ్ ధావన్ ఓవరాక్షన్ గురించి చెప్పుకోకపోవడమే మంచిది. నాన్నంటే భయంతో చేశాడో లేక ఇంకోసారి నాతో సినిమా తీయొద్దని వార్నింగ్ ఇవ్వడానికి అలా నటించాడో కానీ ఆస్కార్ నామినేషన్ పక్కా. ఒకే పాత్ర డ్యూయల్ రోల్ గా మిగిలిన పాత్రలను నమ్మించి బకరా చేయడమనే ఓల్డ్ ఫార్ములా సినిమాలు కావాలంటే హలో బ్రదర్, రాముడు భీముడు, ఆవిడా మా ఆవిడే చూడండి. హాయిగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ కూలీ జోలికి వెళ్లొద్దు. ఆపై మీ ఇష్టం అది కూడా మీ స్వంత రిస్క్ మీద.