నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలు జరిగి దాదాపు నెల రోజులవుతోంది. ఫలితాలు వెలువడిన వారం వ్యవధిలోనే నాలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా.. ఒక్క కేరళలో మాత్రమే చాలా ఆలస్యంగా గురువారం పినరయి మంత్రివర్గం బాధ్యతలు చేపట్టింది.
సంప్రదాయాన్ని బ్రేక్ చేసి వరుసగా రెండోసారి వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్) అధికారంలోకి రావడం ఒక రికార్డ్ అయితే.. సీఎం విజయన్ మినహా గత ప్రభుత్వంలోని మంత్రులెవరినీ కొత్త ప్రభుత్వంలోకి తీసుకోకపోవడమూ రికార్డే. మరీ ముఖ్యంగా గత ఆరోగ్య మంత్రి కే.కె.శైలజను తీసుకోకపోవడం జాతీయ స్థాయిలో ఎంత చర్చనీయాంశమైందో.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు మొహమ్మద్ రియాజ్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం అంతకు మించి చర్చకు తావిచ్చింది. సీఎం విజయనే తన అల్లుడికి మంత్రి పదవి ఇప్పించుకున్నారన్న వాదనలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.మామ సీఎం.. అల్లుడు మంత్రి.. అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదే సందర్బంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంత్రివర్గాల్లో మామ, అల్లుళ్ల ప్రాతినిధ్యం ప్రస్తావనకు వస్తోంది. మామ అల్లుళ్ల బంధం అన్నంత వరకు ఓకే గానీ.. గతంలో ఏపీ, ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గాల్లో మామ అల్లుళ్ల చేరికకు.. తాజాగా కేరళలో వారి ప్రాతినిధ్యానికి ఏమాత్రం పొంతన లేదు.
మొదట సీపీఎం నేత..తర్వాతే అల్లుడు
అన్ని పార్టీల్లాగే వామపక్షాల్లోనూ బంధుప్రీతి మొదలైందని మంత్రిగా రియాజ్ ను ఎంపిక చేసిన వెంటనే సామాజిక, ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. కానీ రియాజ్ ఏడాది క్రితం జూన్ 15న విజయన్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. తర్వాత భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. విజయన్ కుమార్తెతో ఆయనది రెండో వివాహం..
ఇకపోతే సీఎం అల్లుడన్న అర్హత ఆయన్ను మంత్రిని చేయలేదు. సీపీఎం పార్టీతో ఆయనది దశాబ్దాల అనుబంధం. స్కూల్ టైము నుంచే ఎస్ ఎఫ్ ఐ విభాగంలో చేరి పదవులు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ యువజన విభాగం డీవైఎఫ్ ఐ లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆ సంస్థకు జాతీయ అధ్యక్షుడు కూడా ఆయనే.ఇక 1993 లోనే సీపీఎంలో క్రియాశీల సభ్యుడిగా చేరారు. 2009 ఎన్నికల్లో కోజికోడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2021 ఎన్నికల్లో బెయిపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన రాజకీయ నేపథ్యం ముందు సీఎం అల్లుడన్న క్వాలిఫికేషన్ చాలా చిన్నది.
ఇకపోతే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, మంత్రివర్గాల కూర్పు వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో అధికారం కేంద్రీకృతంగా.. అధినేతల చేతుల్లో ఉంటుంది. అదే జాతీయ పార్టీలో అలా ఉండదు. కీలక నేతలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీల్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల సూచనలు, సిఫారసులు కూడా ఆమోదానికి నోచుకోవు.
వామపక్ష పార్టీల్లో వీటిని మరింత కఠినంగా అమలు చేస్తారు. కేరళ కొత్త మంత్రివర్గ కూర్పు విషయంలోనూ అదే జరిగింది. సీపీఎం పార్లమెంటరీ పార్టీ సమష్టి నిర్ణయం ప్రకారమే సుదీర్ఘ కాలంగా పార్టీకి పనిచేస్తున్న రియాజ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
దక్షిణాది వరకు చూసుకుంటే.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మామ సీఎం, అల్లడు మంత్రిగా చేసిన, చేస్తున్న సందర్భాలు కనిపిస్తాయి. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మేనల్లుడు హరీష్ రావు మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే హరీష్ మామను పట్టుకొని ఏకాఎకిన మంత్రి అయిపోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఏళ్ల తరబడి పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి పూర్తి సాధికారికంగానే మంత్రి అయ్యారు. అలాగే తమిళనాడులో కరుణానిధి సీఎం గా ఉన్నప్పుడు.. ఆయన మేనల్లుడు మురసోలి మారన్ మంత్రిగా ఉన్నా.. దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవకు గుర్తింపుగా లభించిన పదవి అది.
ఎన్టీఆర్-చంద్రబాబు ,దగ్గుపాటి .
మన రాష్ట్రంలోనూ ఇటువంటి ఉదంతాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నారా చంద్రబాబు నాయుడు మంత్రులుగా పనిచేశారు.
దగ్గుబాటి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారు.టీడీపీ తొలిసారి బరిలోకి దిగిన 1983 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా పార్టీ బాధ్యలే మోశారు.దగ్గుబాటి 1984 ఉప ఎన్నికలో మార్టూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్టీఆర్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు.
కానీ చంద్రబాబు మాత్రం కేవలం అల్లుడు అన్న అర్హతనే అడ్డం పెట్టుకొని టీడీపీలో నంబర్ టూ స్థాయికి ఎదగడమే కాకుండా చివరికి మామకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని, తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు. 1983 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో ఉన్న ఆయన .. మామ ఎన్టీఆర్ పైనే పోటీచేస్తానని సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోసం అదే మామ పంచన చేరి కర్షక పరిషత్ పర్సన్ ఇన్చార్జిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, ఆర్థిక రెవిన్యూ శాఖల మంత్రిగా పెత్తనం చెలాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లుడి హోదాను రాజకీయ అధికారం కోసం చంద్రబాబు వాడుకున్నంతగా మరెవరూ వినియోగించుకోలేదు.