Idream media
Idream media
ఒకవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించతలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించడం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ చలో ట్యాంక్‌బండ్ చేపట్టి తీరుతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్ వైపునకు వచ్చే అన్ని మార్గాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
మరోవైపు చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి అఖిలపక్షాల మద్దతు కూడా ఉండటంతో వివిధ పార్టీలకు చెం దిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పెద్దెత్తున ముందస్తు అరెస్టులకు దిగారు. కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులతో పాటు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి, తదితర పార్టీలకు చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ గట్టి పట్టుదలతో ఉంది.