iDreamPost
iDreamPost
ఇప్పటి తరం హీరోల్లో ఏడాదికి ఒక్క సినిమా చేయడమే మహా కష్టమైపోతోంది. దానికి కారణం బడ్జెట్ కావొచ్చు లేదా కథలు సెట్ కాకపోవడం ఉండొచ్చు. కానీ ఇలా ఇంత పరిమితంగా చేయడం మాత్రం పరిశ్రమకు ఇబ్బంది కలిగించే విషయమే. ఇప్పుడు ఏ స్టార్ హీరోని చూసుకున్నా సెట్స్ మీద ఒక్క సినిమానే ఉంటుంది. మహా అయితే కథా చర్చల్లో ఇంకో రెండు మూడు అనుకోవడమే తప్ప నిజంగా కార్యరూపం దాల్చినవి సింగల్ డిజిట్ లోనే ఉంటున్నాయి. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి అగ్ర తారలు ఏడాదికి పదికి పైగా సినిమాలు విడుదల చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వారానికి ఒకటి వచ్చిన దాఖలాలు కూడా ఎక్కువే.
సరే ఇప్పటి జెనెరేషన్ స్పీడ్ ఇంతే అనుకున్నా సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ మాత్రం ఇకపై దూసుకుపోతా అంటున్నారు. లైన్ అప్ లో పెట్టిన ప్రాజెక్టులు చూస్తే అదే నిజమనిపిస్తుంది. ప్రస్తుతం ‘బోయపాటి శీను’ దర్శకత్వం చేస్తున్న సినిమా షూటింగ్ లో బాలయ్య బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మార్చ్ లోగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అన్నీ అనుకూలిస్తే వేసవికి విడుదల చేయొచ్చు. ఇక దీని తర్వాత బాలకృష్ణ ఏకంగా నాలుగు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని ఫిలిం నగర్ హాట్ అప్ డేట్. అంటే వచ్చే మూడేళ్లు తన డైరీ ఫుల్ బిజీగా ఉండేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు కనిపిస్తోంది.
తాజాగా ‘గోపిచంద్ మలినేని’ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ కోసం బాలయ్య ఓ సినిమా చేయొచ్చని తెలిసింది. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ చేస్తున్న ‘సంతోష్ శ్రీనివాస్’ చెప్పిన బలరామయ్య బరిలో దిగితే కథ కూడా నచ్చినట్టు ఇది కూడా తెరకెక్కే ఛాన్స్ ఉందని వినికిడి. ఎఫ్3 పనుల్లో దిగిపోయిన ‘అనిల్ రావిపూడి’ ఎప్పటి నుంచో తన అభిమాన హీరో కోసం ఓ కథతో రెడీగా ఉన్నాడు. అన్నీ అనుకూలిస్తే దిల్ రాజు బ్యానర్ లోనే ఇది కూడా ఉండొచ్చట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డెబ్యూ దర్శకుడు ‘శ్రీమన్ వేముల’తో నాగ శౌర్య కాంబోలో మరో ప్రాజెక్ట్ లైన్ లో ఉందని సమాచారం. ఇవన్నీ అధికారిక ప్రకటనల రూపంలో రావాల్సి ఉంది. సో మొత్తం అయిదు సినిమాల లైన్ అప్ తో ఎవరూ లేనంత బిజీగా బాలయ్య మారబోతున్న మాట వాస్తవం.