అదేమిటోగానీ కాంగ్రెస్ అధిష్టానం ఎంత తలబద్దలు గొట్టుకుంటున్నా.. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాపంజాబ్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కారించలేకపోతోంది. పరిష్కారం పేరుతో రాజీలు కుదిర్చినా.. అధికార మార్పిడి చేసినా.. ఇంకేం చేసినా వికటిస్తున్నాయి.. పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. రెండేళ్లుగా పార్టీలో అంతర్గత కలహాలను చల్లార్చేందుకు మధ్యేమార్గంగా అసమ్మతి నేత నవజ్యోత్ సిద్ధూను
జూలైలో పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.
అప్పటికీ పరిస్థితి సద్దుమణగక పోవడంతో ఏకంగా సీఎం అమరీందర్ సింగ్‌నే తప్పించి దళిత నేత చరణ్ జిత్ సింగ్ చన్నీని సీఎం చేశారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు పీసీసీ పగ్గాలు చేపట్టిన రెండు నెలలకే సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది.
బీజేపీ వైపు కెప్టెన్ అమరీందర్
పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, మరికొందరు అసమ్మతివాదుల ఒత్తిళ్లకు తలొగ్గి తనను అధిష్టానం అవమానకరమైన రీతిలో సీఎం పదవి నుంచి తప్పుకునేలా చేసిందని రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 18న సీఎం పదవి వీడిన ఆయన సిద్ధూతోపాటు కాంగ్రెస్‌పైనా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయిస్తానని అప్పట్లోనే ప్రకటించిన ఆయన.. సిద్ధూను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని, అతనిపై గట్టి అభ్యర్థిని నిలబెడతానని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఈ వ్యాఖ్యలతోనే ఆయన పార్టీ పెట్టడం గానీ, బీజేపీలో చేరడం గానీ ఖాయమని వార్తలు వచ్చాయి. కేంద్రమంత్రి రామదాసు అథవాలె తదితరులు బీజేపీలోకి రమ్మని కూడా కెప్టెన్‌ను ఆహ్వానించారు కూడా. వీటన్నింటినీ నిజం చేస్తూ మాజీ సీఎం బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.
అందుకోసమే ఆయన ఢిల్లీ చేరుకున్నారని.. ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాలతో భేటీ కానున్నారని ప్రచారం జరువుతోంది. అబ్బే.. ఆయన వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వచ్చారని అమరీందర్ సిబ్బంది ప్రకటించినా ఈ ప్రచారం ఆగడం లేదు. వీలైతే అమరీందర్ ఈ రోజే కాషాయ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఒకవేళ బీజేపీలో చేరకుండా సొంత పార్టీ పెట్టినా సహకరించి పంజాబ్ ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్డీయే నుంచి ఆకాలీ దళ్ వెళ్లిపోయిన తర్వాత పంజాబ్‌లో బీజేపీకి పేరున్న సిక్కు నేతలు లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్న మాజీ సీఎం అమరీందర్‌ను వాడుకోవాలని కమలం నేతలు భావిస్తున్నారు.
పీసీసీ చీఫ్ సిద్ధూ రాజీనామా
అమరీందర్ సింగ్ తాజా వైఖరితో ఇరకాటంలో పడిన కాంగ్రెస్ అధిష్టానానికి పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఝలక్ ఇచ్చారు. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపారు. మనిషిగా తన వ్యక్తిత్వం కుప్పకూలిపోయినా పర్వాలేదు గానీ పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం ఆశలు కూలిపోవడానికి అంగీకరించబోనని లేఖలో పేర్కొన్నారు. సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం అసమ్మతి కార్యకలాపాలు నిర్వహించిన ఆయన పెద్ద పదవులు ఆశించారు. చివరికి రాజీ మార్గంగా సిద్ధూను జులై 18న అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. తర్వాత రెండు నెలలకే ఆయన ప్రత్యర్థి అమరీందర్‌ను సీఎం పదవి నుంచి తప్పించింది.
సిద్ధూ ఆధ్వర్యంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని పార్టీ ఇంఛార్జి హరీష్ రావత్ కూడా ప్రకటించారు. కానీ మాజీ సీఎం అమరీందర్ హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడంతో ఆయన్ను కాంగ్రెస్ అధిష్టానమే పిలిపించిందన్న అనుమానం సిద్ధులో ఏర్పడిందంటున్నారు. అందుకే రాజీనామా చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజకీయాల్లో సిద్ధూ వైఖరి మొదటి నుంచీ ఇలాగే ఉంది. మొదట బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీని ఇబ్బంది పెట్టి బయటకు వచ్చేశారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు మంతనాలు జరిపారు. కానీ దాన్ని కాదని కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల నుంచి సీఎం అమరీందర్ కు పక్కలో బల్లెంలా మారారు. ఆయన పదవి పోవడానికి కారణం అయ్యారు. ఇప్పుడు రాజీనామాతో మరో సంక్షోభానికి తెర తీశారు.
ఏమైనా ఓకే రోజు జరిగిన రెండు పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో అయోమయం, ఆందోళన పెరిగాయి.