iDreamPost
iDreamPost
నాలుగు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు మన హాకీ టీం ఒలింపిక్స్ పతకాన్ని ముద్దాడింది. అది చూసి యావత్తు దేశం మురిసిపోయింది. సంబరాలు చేసుకుంది. హాకీ జట్టు సభ్యులను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తోంది. కానీ గత కొన్ని దశాబ్దాలుగా పతనావస్థలో కొట్టుమిట్టాడిన భారత హాకీ నేలకు కొట్టిన బంతిలా మళ్లీ పైకి లేవడానికి.. దాన్ని బతికించడానికి తెర వెనుక కృషి చేసిన ఒకరి ఘనతను అందరూ విస్మరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మన హాకీకి ఆయన వెన్నుదన్నుగా ఉన్న విషయం ఆ ఆటతో పరిచయం ఉన్న కొద్దిమందికి తప్ప మిగతా వారికి తెలియదు. జాతీయ హాకీ జట్టు వెనుక ఉండి.. ఆర్థికంగా అండదండలు అందించి వెన్నుతట్టి ప్రోత్సహించిన ఆ నేత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.
అక్కున చేర్చుకొని ఆదరించారు
భారత జాతీయ క్రీడ అయిన హాకీకి ఘన చరిత్రే ఉంది. గతంలో ఒలింపిక్స్ లో తిరుగులేని జట్టుగా వీరవిహారం చేసి ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించిన చరిత్ర దాని సొంతం. అయితే ఆ వైభవం క్రమంగా క్షీణించింది. పతకాల వేటలో చతికిల పడింది. చివరికి 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత కూడా సాధించలేని దీన స్థితికి దిగజారింది. దాంతో హాకీ రంగం పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. అదే సమయంలో జట్టును పోషించే స్పాన్సర్లు కూడా లభించని దుస్థితి ఏర్పడింది. సహారా గ్రూప్ స్పాన్సరుగా ఉండేది. 2018లో దాని గడువు ముగియడంతో.. కొత్త స్పాన్సర్లు ముందుకు రాలేదు. సరిగ్గా ఆ సమయంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అపద్బాంధవుడిలా ముందుకొచ్చారు. రూ. 100 కోట్లతో ఐదేళ్లపాటు హాకీ ఇండియాను స్పాన్సర్ చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. పురుషులు, మహిళలు రెండు టీములకు స్పాన్సరుగా మారారు. ఇది జరిగిన మూడేళ్లకే మన హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్ లో పులుల్లా చెలరేగడం మనం చూస్తున్నాం. పురుషుల జట్టు కాంస్యం సాధించగా.. మహిళల జట్టు దానికి అడుగు దూరంలో ఉంది.
స్వయంగా హాకీ క్రీడాకారుడు
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్వయంగా హాకీ క్రీడాకారుడు. డూన్ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడి హాకీ జట్టుకు గోల్ కీపర్. ఆ ఇష్టంతోనే హాకీ ఇండియాను ఆదరిస్తున్నారు. స్పాన్సరుగానే కాకుండా గత ఏడేళ్లుగా ఒడిశా రాష్ట్రాన్ని హాకీ పోటీలకు వేదికగా మార్చి ప్రోత్సహిస్తున్నారు. 2014లో చాంపియన్స్ ట్రోఫీ హాకీ పోటీలకు ఆ రాష్ట్రమే ఆతిధ్యమిచ్చింది. 2017లో ఒడిశా స్పాన్సరుగా ఉన్న కళింగ లాన్సర్ టీమ్ హాకీ ఇండియా లీగ్ లో గెలిచింది. 2018లో హాకీ వరల్డ్ లీగ్ పోటీలను, 2019లో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్, ఒలింపిక్స్ హాకీ క్వాలిఫైయింగ్ పోటీలు, 2020లో ఎఫ్ ఐహెచ్ ప్రోలీగ్ పోటీలను ఒడిశా రాష్ట్రంలోనే నిర్వహించేందుకు అవకాశం కల్పించడం ద్వారా నవీన్ పట్నాయక్ హాకీకి వెన్నుదన్నుగా నిలిచారు.