iDreamPost
iDreamPost
పత్రికలు కేవలం సమాచార సాధనాలు మాత్రమే కాదు. ఒకనాటి విజ్ఞాన వీచికలు… ఉద్యమ వాహకాలు.. చైతన్య దీపికలు.. ప్రజలకు అండగా నిలిచే ఆయుధాలు.. ఇలా ఒకటేమిటి అన్నింటికీ పత్రికలే. పత్రికల ఆధారంగానే స్వతంత్ర్య సమరం సాగింది. లక్షలు, కోట్ల కొలదీ ప్రజలను నడిపించింది. బ్రిటీష్ వారిని తరిమికొట్టి భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపేందుకు దోహదపడింది. గాంధీ నుంచి అంబేద్కర్ వరకూ అందరూ పత్రికల్లో పనిచేశారు. పత్రికల కోసం పనిచేశారు. పత్రికా స్వతంత్ర్యకోసం నిలిచారు. స్వతంత్ర్యానంతరం కూడా రెండు మూడు దశాబ్దాల పాటు పత్రికలు తమ విశిష్టతను నిలపుకున్నాయి. ప్రజా సమూహంలో విస్తృత ప్రభావాన్ని చూపగలిగాయి.
కానీ గడిచిన మూడు దశాబ్దాలుగా పత్రికారంగం ప్రభావం కోల్పోతుందన్నది కాదనలేని సత్యం. అందులోనూ గత దశాబ్దకాలంగా సోషల్ మీడియా తాకిడితో తీవ్రంగా తల్లడిల్లిపోతోంది. డిజిటల్ మీడియా యుగంలో దారి తెన్నూ తెలియని దశకు చేరుకుంది. అందుకు తోడుగా కరోనా కారణంగా ఏర్పడిన సమస్యలు కుదేలయ్యేలా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముసురుకుంటున్న ఆర్థిక సంక్షోభంలో మునుపెన్నడూ లేనంత సమస్యల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పత్రికలు కూడా పూర్వ వైభవం ఇక కల్ల అనే నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా పలు మార్పులు చేసుకుంటున్నారు. సిబ్బంది విషయంలోనూ, ఇతర రకాలుగానూ సర్థుబాట్లు చేసుకుంటున్నారు.
జాతీయ స్థాయిలోనూ పత్రికారంగం పెను మార్పులకు గురవుతోంది.
ఇప్పటికే పత్రికారంగంలో యాజమాన్యాలు కొన్ని గ్రూపుల చేతుల్లోనే ఉన్నప్పటికీ వాటి నిర్వహణ విషయంలో నానా అవస్థలు పడుతున్నారు. వార, మాస పత్రికలన్నీ దాదాపుగా మూతపడ్డాయి. దినపత్రికల సర్క్యులేషన్ కూడా పడిపోతోంది. అదే సమయంలో వ్యాపార ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం కూడా కుచించుకుపోతోంది. దాంతో టైమ్స్, ది హిందూ, ఆనందబజార్ వంటి పత్రికలు నిర్వహణను డిజిటల్ రంగానికి ప్రాధాన్యతనిస్తూ అటు వైపు మళ్లిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పత్రికలకు నేరుగా ప్రింట్ ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే డిజిటల్ ఆదాయం పెరుగుతుండడంతో పరిణామాలు దానికి తగ్గట్టుగా ఉన్నాయి.
తెలుగు మీడియా అదే రీతిలో సాగుతోంది. సుమారు 20,30 ఏళ్ల పాటు క్రమంగా పెరుగుతూ వచ్చిన ఈనాడు వంటి పత్రికల సర్క్యులేషన్ తగ్గుముఖం పట్టింది. ఆంధ్రజ్యోతి సహా ఇతర పత్రికల చందాదారులు క్షీణిస్తున్నారు. కొందరైతే సర్క్యులేషన్ పడిపోవడమే శ్రేయస్కరమనే ఉద్దేశంతో ఉన్నారంటే ఆశ్చర్యమే. నిర్వహణా వ్యయం, ముఖ్యంగా ప్రింటింగ్ ఖర్చు తగ్గించుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అన్నింటికీ మించి పత్రికారంగం విశ్వసనీయత కోల్పోవడం అత్యంత కీలక సమస్యగా మారబోతోంది. ఒకనాడు పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రామాణికంగా తీసుకున్న పాఠకులు ప్రస్తుతం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ పత్రిక రాజకీయ ప్రాధాన్యతలనే ప్రమాణికంగా తీసుకుని, వాస్తవాలకు విరుద్ధంగా సాగుతున్న సమయంలో విశ్వసనీయతకు చోటు క్షీణిస్తోంది. అది పాఠకుల నమ్మకాన్ని కోల్పోతోంది. యాజమాన్యాల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కథనాలు అల్లేసే క్రమంలో పత్రికారంగా ప్రాధాన్యత కోల్పోతుండడం గమనార్హం.
జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ప్రభుత్వాలు కూడా వాటికి ప్రాధాన్యతనిచ్చేందుకు సిద్ధపడడం లేదని చెప్పవచ్చు. పత్రికల కన్నా డిజిటల్ మీడియా ద్వారా ఎక్కువ మందిని చేరేందుకు అవకాశం ఉండడంతో అటువైపు దృష్టి సారిస్తున్నారు. దాంతో పత్రికలు పూర్తిగా కనుమరుగయ్యే దశ వస్తుందనే అంచనాలు అతిగా ఉండవచ్చు గానీ ప్రస్తుతానికి ప్రాధాన్యత రీత్యా వాటికి విలువ తగ్గుతోంది. ఒకనాడు రాజ్యమేలిన చోట ఇప్పుడు పత్రికలు బిక్కుబిక్కుమంటూ సాగుతున్నాయి. పాలకులను, పాలనను శాసించి, ఒక్క వార్తతో సంచలనాలు రేపిన చరిత్ర ఉన్న పత్రికా రంగం ఈనాడు ఈ స్థితికి చేరడానికి అనేక కారణాలున్నాయి. కొన్ని వ్యవస్థాపరమైనవి అయితే కొన్ని వృత్తిపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. మొత్తంగా పత్రికారంగం పూర్వ వైభవం సాధించకపోయినా, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా నిజమైన పరీక్షగానే భావించాలి.