ఏప్రిల్ నెలలో తమిళనాడులో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల పరిశీలనకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు గత డిసెంబరు లోనే 21, 22 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. దీనిపై ఇప్పటికే వారు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం కూడా సునీల్ అరోరా నేతృత్వంలోని ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది. దీంతో ఎన్నికల వేడి పెరిగింది. రాష్ట్రీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలన్నీ తమిళనాడుపైనే దృష్టి కేంద్రీకరించాయి. స్థానిక పార్టీలకు మద్దతుగా జాతీయ పార్టీ ల నుంచి అగ్ర నేతలు వచ్చి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.
తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేకి పరోక్షంగా బీజేపీనే సహకారం అందిస్తోంది. ఎన్డీయే అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపాదించిన వారిలో తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా ఉన్నారు. అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య విబేధాలు వచ్చినా కూడా బీజేపీ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ముందునుంచే వచ్చాయి. దాన్ని ధ్రవీకరిస్తూ గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల వ్యూహరచన కోసం తమిళనాడులో నడ్డా పర్యటిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే నడ్డా నాలుగు సార్లు తమిళనాడుకు వచ్చారు. అందరికన్నా ముందుకుగా తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. తొలి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. కాగా, బీజేపీ జాబితాలో ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బు, స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణిలకు బెర్తులు కన్‌ఫార్మ్ అయినట్లుగా తెలుస్తున్నది. వీరిద్దరూ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నారు. ఇలీవలనే బీజేపీలో చేరిన టీమిండియా మాజీ పేసర్ ఎల్ శివరామకృష్ణన్ కూడా చెన్నై నగరంలోని ఒక అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఆదివారం తమిళనాడులో పర్యటించారు. పలు కీలక ప్రాజెక్టులకు పునాది రాయి వేసి, చెన్నై వద్ద అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంక్ (ఎంకే-1ఏ) ఆర్మీకి అప్పగించారు. కొచ్చిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. చెన్నై మెట్రో రైలు దశ -1 పొడిగింపును ప్రారంభించారు. చెన్నై బీచ్ – అత్తిపట్టు మధ్య నాల్గో రైల్వేలైన్, విల్లుపురం – కడలూరు – మాయిలాదుత్తురై – తంజావూర్, మాయిలాదుత్తురై-తిరువారూర్లలో సింగిల్ లైన్ రైల్వే విద్యుద్దీకరణ, గ్రాండ్ అనికట్ కెనాల్ వ్యవస్థ విస్తరణ, ఆధునికీకరణకు పునాది రాయి వేశారు.
ఐఐటీ మద్రాస్ డిస్కవరీ క్యాంపస్‌కు కూడా పునాది రాయి వేయనున్నారు. 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి దశలో రూ.1,000 కోట్ల వ్యయంతో చెన్నై సమీపంలోని థాయూర్ వద్ద క్యాంపస్ నిర్మించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనుల నిర్వహణలో వేగం పెంచడం ఆసక్తికరంగా మారింది. అలాగే ఆధ్యాత్మికవేత్త బంగారు అడిగలర్ ను ప్రధాన మంత్రి కలిశారు. పరాశక్తి చారిటబుల్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉంటున్న అడిగలర్ కు పెద్ద సంఖ్యలో అనుచరులు, భక్తులు ఉన్నారు. కేంద్రం ఆయనకు 2019లో పద్మశ్రీ అందించింది. తమిళనాడుకు వెళ్లిన మోదీ ప్రత్యేకంగా ఆయనను కలవడం ఆకట్టుకుంది.
కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే తమిళనాడులో ప్రచారం ప్రచారం ప్రారంభించింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత నెలలోనే రాహుల్ కోయంబత్తూరు నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో కలియతిరిగారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్మికులతో పాటు రైతులు, చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి పోరాడతామని చెప్పారు. అక్కడి స్థానికులతో కలిసి మష్రూం బిర్యానీ తిన్నారు. ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ అనే యూట్యూబ్ చానెల్ నిర్వాహకులు అప్‌లోడ్ చేసిన ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. 38 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఈ దఫా కూడా రెండు పార్టీలూ కలిసి అన్నాడీఎంకే, బీజేపీ కూటమిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికలలో బీజేపీ ప్రభావం తమిళనాడులో పెద్దగా లేదు. ఈ సారి ఆ పార్టీ గట్టిగా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.