iDreamPost
iDreamPost
దాదాపుగా మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తరహాలో ఇంటింటికీ తిరిగిన నారా లోకేష్ అనూహ్యంగా మాయమయ్యారు. దాదాపు 20 రోజులుగా ఆయన అన్నింటికీ దూరంగా ఉన్నారు. కేవలం ట్వీట్లు తప్ప లోకేష్ జాడ కనిపించడం లేదు. దాంతో ఆయనకు ఏమయ్యిందోననే ఆసక్తి మొదలయ్యింది. ఎందుకు బయటకు రావడం లేదనే అనుమానం కలుగుతోంది. వరుసగా మూడు, నాలుగు వారాల పాటు ఏపీకి దూరంగా ఉండడం వెనుక కారణాలేంటా అనే చర్చ సాగుతోంది.
సహజంగా ప్రతీ సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీకి రావడం, వీకెండ్స్ లో మళ్లీ తిరిగి హైదరాబాద్ చేరడం నారా కుటుంబంలో తండ్రీ, బిడ్డలిద్దరికీ అలవాటుగా మారింది. కొన్ని సార్లయితే ఏవో కార్యక్రమాలు పెట్టుకుని నేరుగా అక్కడికే వస్తుండగా, అత్యధిక సందర్భాల్లో మాత్రం మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడం, రెండు ప్రెస్ మీట్లు, మూడు రివ్యూలతో కాలయాపన చేయడం చంద్రబాబుకి అలవాటుగా మారింది. అదే సమయంలో లోకేష్ నేరుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతున్నారు. మూడు నెలలుగా నిత్యం ఇదే పనిగా పెట్టుకున్నారు. దాదాపుగా రెండు మండలాల్లో పలు గ్రామాలు తిరిగేశారు. దాంతో ఆయన ఎన్నికల సన్నాహాల్లో ఉన్నారని అంతా భావించారు.
ముఖ్యంగా కుప్పం ఫలితాల తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నారా లోకేష్ నిత్యం మంగళగిరిలో కనిపించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వినిపించింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్టు కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారని అంచనా వేశారు. కానీ తీరా చూస్తే కొంతకాలంగా ఆయన అటు నియోజకవర్గానికి, ఇటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. వివిధ సందర్భాల్లో కేవలం ట్వీట్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు. దాంతో ఆయనకు ఏమయ్యిందోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వ్యక్తిగత సమస్యలా లేక ఇంకా ఏమయినా కారణాలా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా పార్టీ వ్యవహారాల్లో అంతా తానై వ్యవహరించాలని లోకేష్ ఆశిస్తున్నారు. కానీ ఆయన సారధ్యానికి చాలామంది సీనియర్లు ససేమీరా అంటున్నారు. ఈ సందిగ్దంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది కూడా లోకేష్ కి అసంతృప్తిని కలిగిస్తోంది.
ఏపీ అంతటా పాదయాత్ర గానీ, సైకిల్ యాత్ర గానీ చేయాలనే సంకల్పంతో నారా లోకేష్ ఉన్నారు. కానీ దాని సాధ్యాసాధ్యాలపై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ పార్టీ వ్యవహారాల జోలికి రాకపోవడం ఏమిటోననే ప్రశ్న ఉదయిస్తోంది. తొలుత న్యూ ఇయర్ కి ముందు ఆయన థాయిలాండ్ వెళ్లారనే ప్రచారం సాగింది. కానీ చివరకు సంక్రాంతికి నారా వారిపల్లెలో కూడా దర్శనమివ్వలేదు. ఏటా సంక్రాంతికి నారావారిపల్లెకి వెళ్లే చంద్రబాబు కుటుంబం ఈసారి దూరంగా ఉండడానికి, లోకేష్ కొంతకాలంగా బయటకు రాకపోవడానికి ఏమయినా సంబంధం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. ఏమయినా లోకేష్ వ్యవహారం టీడీపీ నేతలను కూడా ఆలోచనలో పడేస్తోంది. ఏపీలో పరిణామాలతో చంద్రబాబు తీవ్రంగా మధనపడుతుంటే లోకేష్ ఆయనకు మరింత సమస్యలు తీసుకొస్తున్నారనే అబిప్రాయం చాలాకాలంగా ఉంది. తాజా పరిణామాల్లో ఏం జరుగుతోందననేది అంతుబట్టని అంశంగా మారింది.