iDreamPost
iDreamPost
రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా దానికి ఆందోళన కలర్ పులిమేసి, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిందని ప్రచారం చేసేసి, సీఎం జగన్ అసమర్థత వల్లే ఇదంతా అంటూ విమర్శలు గుప్పించేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిపోయింది. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో నెలకొన్న ఉద్రిక్తతను కూడా ముఖ్యమంత్రికి లింకు పెట్టి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించేశారు.
మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై తనకున్న అక్కసును వెళ్లగక్కారు. స్థానిక మైథాన్ కర్మాగారాన్ని తెరిచి తమకు ఉపాధి కల్పించాలని మహిళా కూలీలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించారు. అయితే పోలీసు వాహనాల్లో ఎక్కేందుకు మహిళలు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు తోపులాట జరిగింది. ఆందోళన నిర్వహిస్తున్న వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పారిశ్రామికవాడ వద్ద పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతే ఇక చూస్కోండి మన ట్విట్టర్ బాబు లోకేశ్ వెంటనే తన తెలివితేటలకు పదును పెట్టేశారు.
పోలీసులు గన్‌లు పట్టుకోవడమూ తప్పేనా?
జగన్ అన్న అని పిలిచినందుకు గన్‌లు పట్టుకున్న పోలీసులను అక్కాచెల్లెమ్మలపైకి పంపారా? అని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిని ప్రశ్నించేశారు. శాంతియుతంగా.. నిరసన తెలుపుతున్న మహిళలపై పోలీసులతో లాఠీచార్జీ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిజానికి అక్కడ కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోగా.. ఆగ్రహంతో మహిళలే పోలీసులపై మట్టిచల్లారు. అయినా పోలీసులు సంయమనం పాటించారే తప్ప లాఠీచార్జి చేయలేదు. కాని అక్కడ లాఠీచార్జి జరిగినట్టు లోకేశ్ ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం సహజం. దీన్ని సాకుగా చూపి సీఎంపై విమర్శలు చేయడమే అసహజంగా ఉంది. అక్కడికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు లాఠీలు, తుపాకులు ఇచ్చి మహిళలపై దండయాత్రకు పంపినట్టు లోకేశ్ ఆవేశపడిపోవడమే విచిత్రంగా ఉంది.
మీ పాలనలో మహిళలకు భద్రతలేదు. చివరికి ఉపాధి కోసం రోడ్డెక్కితే చావగొట్టించారు అని అవాస్తవాలు ట్వీట్ చేసిన లోకేశ్‌కు తెలుగుదేశం హయాంలో అంగన్వాడీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడమే కాక గుర్రాలతో తొక్కించిన విషయం తెలియదా? గన్‌లు పట్టుకున్న పోలీసులను అక్కాచెల్లెమ్మలపైకి పంపడమే తప్పు అంటున్న లోకేశ్‌కు విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆందోళన చేసిన వారిపై బషీర్‌బాగ్‌లో ఏకంగా కాల్పులు జరిపి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న చరిత్ర టీడీపీ ప్రభుత్వానిది అన్న సంగతి గ్రహించాలని వైఎస్సార్ సీపీ నాయకులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎన్నాళ్లీ దౌర్జన్యాలు, దాడులు అంటూ ఊగిపోతున్న చినబాబు టీడీపీ హయాంలో ఎమ్మెల్యే రోజాపై, ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దౌర్జన్యాలకు ఏం బదులిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కాని ఇలా దిగజారుడు కాదని వైఎస్సార్ సీపీ నేతలు లోకేశ్‌కు హితవు చెబుతున్నారు.
Also Read : కల్తీ జీలుగు కల్లు ఘటన.. ఇప్పుడేమంటారు బాబూ?