టచ్ చేస్తే చాలు కామెడీలు కాయించేగల మామా అల్లుళ్ళు రాష్ట్రంలో ఉన్న విషయం ప్రజలందరికీ విదితమే. రాష్ట్రంలోకి మిడతలు రాకుండా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసే అల్లుడే ‘గొప్ప’ అనుకుంటే.. కుటుంబంతో వెన్నుపోటు దెబ్బతిన్న వ్యక్తి చల్లగా చూస్తే ఎన్నికలకొచ్చేదాకా అక్కర్లేదు ముందే మా పార్టీ అధికారంలోకొచ్చేస్తుందని సెలవిచ్చే మామ ఇంకా గొప్పోడుగా నిలుస్తాడు.
పరిచయం, పేర్లు చెప్పక్కర్లేని ఈ మామా అల్లుళ్ళు ఎన్నికల ముందు జనానికి పిచ్చకామెడీని కాయించేసారు. మేం ఇంకా ఇక్కడే ఉన్నాం అన్నట్లుగా ఇటీవలే అప్పుడప్పుడు మైకుముందు కొస్తున్నారు. వచ్చేటప్పుడు ఎవర్నైనా అడుగుతారా అంటే అదీ లేదాయె. దీంతో ఏళ్ళతరబడి పార్టీనే నమ్ముకున్న వాళ్ళంతా నెత్తిన చెయ్యేసుకుని దిక్కులు చూస్తున్నారు. ఇకప్పుడు ఒక వెలుగు వెలిగి ఉండొచ్చుగాక, కానీ ఆ తరువాత ‘నిర్ణీత గడువుతేదీ’ (ఎక్స్‌పైరీడేట్) ఒకటుంటుంది. ఆ డేట్ తరువాత కొంచెంకొంచెంగా ఆ వెలుగు తగ్గడం ప్రజాజీవితంలో ఉన్న వాళ్ళకు అనుభవపూర్వకమే. అధికారం వెలుగు ఉన్నప్పుడు ప్రజలు, తోటి నాయకులతో ఎలా మెలిగారు? అన్నదానిపైనే నిర్ణీతగడువుతేదీ ఆధారపడి ఉంటుంది.
అయితే ఇవేమీ పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానేనని, అధికారం పోయాక అందరూ కలిసి రావాలని చెప్పడం గతంలో చెల్లింది కానీ, ఇప్పుడు చెల్లనిదైపోయింది. ఈ నేపథ్యంలో పార్టీని నానా పాట్లుపడి ఫార్టీఇయర్స్ లాగిస్తుంటే ఈ మామా అల్లుళ్ళ తీరు మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లుగా తయారవుతోంది. అయినప్పటికీ పార్టీ అధినేతకు మాత్రం పుత్రరత్న ప్రీతి తగ్గడం లేదు. బామ్మర్దిని వదులుకోలేడు. ప్రజా స్వామ్యంలో గద్దెనెక్కే అర్హత ప్రజల మనస్సులు గెల్చుకున్నవాళ్ళకే ఉంటుంది. అలా కాదని ఎక్కిస్తే.. కూర్చోగలిగే శక్తి సదరు వ్యక్తికి ఉండడం తప్పని సరి.
వర్షం రాకుండా, ఎండలు కాయకుండాను, మిడతలు రానీయకుండా చేయగలగడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమవుతుందా? కనీసం ఈ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఉత్తరాలు రాసేంత జ్ఞానం ఉన్న అల్లుడు, కేంద్ర ఎన్నికల సంఘమే సాధ్యం కాదన్న జమిలి ఎన్నికలపై ఆశపెట్టుకున్న మామ వీళ్ళని నమ్ముకుని ధైర్యంగా ముందుకు నడవలేని పార్టీ యంత్రాంగం.. ఏతా వాత తేలేదేంటంటే సినిమా ‘తమ్ముడు’ చెప్పినట్టు ఏపీలో రావడం కష్టమే.