iDreamPost
iDreamPost
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కళ్లు తెరిచారు. కుప్పంలో తన తండ్రి కోటకు బీటలు వారిన తర్వాత పాఠం నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేస్తే ఏ నియోజకవర్గంలోనూ తమ హవా సాగదని తెలుసుకున్నట్టుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా మంగళిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి అంతగా ప్రాధాన్యతనివ్వని లోకేష్ ఇప్పుడు మూడు రోజులుగా మకాం వేశారు. వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. టీడీపీ క్యాడర్ లో ఉత్సాహం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనే ఆపార్టీ పరిస్థితి పేలవంగా మారుతోంది. దాంతో మంగళగిరి లాంటి చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మళ్లీ మునిగిపోతామనే భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు దీక్ష సందర్భంగా తాను మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తానని లోకేష్ ప్రకటించారు. గెలిచి తమ అధినేతకు గిఫ్ట్ గా ఇస్తామని కూడా శపథం చేశారు. కానీ రాజకీయ పరిస్థితి అంత సానుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతల అంచనాలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ స్థితికి పొంతన కనిపించడం లేదు.
వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకుకి పెద్దగా ఢోకా లేకుండా పోయింది. పైగా పథకాల లబ్దిదారుల మూలంగా కొత్తగా మరింత మంది చేరారు. సామాజిక సమీకరణాలు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మంగళగిరిలో వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం టీడీపీకి కత్తిమీద సాములా ఉంటుంది. అమరావతి వ్యవహారంలో టీడీపీ ఎంత ఉద్యమం చేసినా మంగళగిరిలో మళ్లీ కోలుకోలేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందులోనూ టీడీపీలో తదుపరి నాయకుడెవరనే సమస్య కూడా ఉత్పన్నమవుతున్న తరుణంలో లోకేష్ కి ఇది అతి పెద్ద సవాల్ గా చెప్పాలి. 2019లో ఆయన ఓడిపోయినా జగన్ వేవ్ లో భాగమని కొందరు భావించారు. ఈసారి అలా ఉండదు. మళ్లీ పరాజయం పాలయితే మాత్రం లోకేష్ పొలిటికల్ లైఫ్ కే ఫుల్ స్టాప్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేందుకు చినబాబు రంగంలో దిగినట్టు కనిపిస్తోంది.
మొదట తాడేపల్లి మండలంలో, ఆ తర్వాత దుగ్గిరాల, మూడో రోజు మంగళగిరిలో లోకేష్ విస్తృతంగా తిరుగుతున్నారు. తెలుగు తమ్ముళ్ల తలుపులు తడుతున్నారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇస్తున్నారు. తద్వారా క్యాడర్ ని కదిలించే పనిలో ఉన్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీని గాడిలో పెట్టకపోతే తన ఆశలు గల్లంతవుతాయనే బెంగతో ఉన్న లోకేష్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళగిరిలో గత ఎన్నికల్లో భారీగా తాయిలాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో బోల్తా పడిన లోకేష్ ఈసారి చేస్తున్న కసరత్తులు ఏమేరకు వర్కవుటవుతాయో చూడాలి.
Also Read : Chandrababu- జగన్ ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబుకు మంచి అవకాశం