iDreamPost
android-app
ios-app

సిక్కోలు గుంట సింగపూర్ అందాలరాశి

సిక్కోలు గుంట సింగపూర్ అందాలరాశి

అందాల పోటీలో మరోసారి తెలుగు సంతతి యువతి సత్తా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అందాల పోటీల్లో ప్రవాస భారతీయ యువతులు తమ చక్కనైన అందం, తెలివి, ప్రతిభతో అందాల కిరీటాలు గెలుచుకున్న సందర్భాలు అనేకం. సింగపూర్ మిస్ యూనివర్స్-2021 కిరీటం తెలుగు సంతతికి చెందిన నందితా బన్నాను వరించింది. సింగపూర్ సిటీలోని నేషనల్ మ్యూజియంలో నిర్వహించిన ఈ పోటీల్లో నందిత ఫస్ట్ ప్లేస్ లో నిలిచి ఇండియాతో పాటు తెలుగింటి పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేశారు.

నందిత తల్లిదండ్రులది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా. అయితే వారు 25 ఏళ్ల కిందట సింగపూర్ వెళ్లి స్థిరపడ్డారు. నందిత తండ్రి గోవర్థనరావు ఏవియేషన్ సప్లై చెయిన్ లో సీనియర్ మేనేజర్, ఆమె తల్లి మాధురి సివిల్ ఇంజినీర్. నందిత సోదరుడు హర్ష సౌరవ్.. కెనడా వాంకోవర్ లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు.

ప్రస్తుతం నందిత వయస్సు 21 ఏళ్లు కాగా ఎత్తు.. 5 అడుగుల 9 అంగుళాలు. సింగపూర్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సు చదువుతున్నారు. కొత్త నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడాన్ని ఇష్టపడే నందిత, కోడింగ్ కూడా నేర్చుకుంటున్నారు. స్కేటింగ్, డ్యాన్స్, కుకుంగ్ నందిత హాబీలు.

విజేతగా నిలిచిన అనంతరం, ఆమె మాట్లాడుతూ సింగపూర్ లో జాతి వివక్ష వంటి అంశాలను ఎత్తి చూపాలనుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఇజ్రాయెల్ లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో నందిత సింగపూర్ కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

మిస్ అమెరికా 2013 పోటీల్లో ప్రవాసాంధ్ర సంతతికి చెందిన నీనా దావులూరి గెలిచి చరిత్ర సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అందాల పోటీల్లో తెలుగు సంతతి వ్యక్తులు సత్తా చాటిన సందర్భాలు చాలా ఉన్నాయి.