Idream media
Idream media
ఏపీలోని దేవాలయాల దాడుల కుట్రలో తెలుగుదేశం నేతలున్నట్లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన సహా పలు కేసుల్లో ఆ పార్టీతో సంబంధం ఉన్న వారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రణాళికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు మరోసారి స్పష్టం అయింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ పరిధిలోని సంతబొమ్మాళి మండలంలో మత విద్వేషాలు సృష్టించేందుకు యత్నించిన టీడీపీ నాయకులు అడ్డంగా బుక్కయ్యారు. అక్కడి పాలేశ్వరస్వామి ఆలయంలో శిథిలమైన నంది విగ్రహాన్ని తొలగించి కొత్త నంది విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్ఠించారు.
ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు జీర్ణావస్థకు చేరిన పాత నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా పాలేశ్వరస్వామి జంక్షన్ వద్ద గల సిమెంట్ దిమ్మెపై ఈ నెల 14న గుట్టుచప్పుడు కాకుండా ప్రతిష్ఠించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఇక్కడ దిమ్మె నిర్మించగా.. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు అక్కడ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో అచ్చెన్న బ్యాచ్ పక్కా ప్లాన్‌తో ఆ దిమ్మెపై నంది విగ్రహాన్ని నెలకొల్పి ఆ తరువాత పాలేశ్వరం జంక్షన్‌లో ఉన్న నంది విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం జరగబోతోందంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది..
22 మందిపై కేసు నమోదు
రాష్ట్రవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలేశ్వరస్వామి జంక్షన్‌లో శిథిలమైన నంది విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు ఉందని విశాఖ రేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావు తెలిపారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ గ్రామ వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే ఒక రాజకీయ పార్టీకి చెందిన నలుగురు, ఇద్దరు ఆలయ కమిటీ సభ్యులు సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. రామతీర్థం ఘటనలో నిందితుల్ని పట్టుకునేందుకు 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించా. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ గ్రామంలో పురాతనమైన, శిథిలమైన విగ్రహాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాన్నారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయం నంది విగ్రహం తరలింపు కేసులో విచారణకు హాజరుకావాలని ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈనెల 14న నంది విగ్రహాన్ని తరలించి పక్కనే ఉన్న మూడు రోడ్ల కూడలిలో విగ్రహాన్ని ప్రతిష్టించి పట్టుబడిన టీడీపీ నేతలు విగ్రహం తరలింపు ముందు రోజు అచ్చెన్నాయుడిని కలిసినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.